04-02-2026 12:00:00 AM
మున్సిపాలిటిలో అందరి చూపు చైర్మన్ పీఠం వైపే..
వ్యూహరచనలో రాజకీయ పార్టీలు
ఓటర్లకు అంతు చిక్కని రాజకీయం
మలుపులు తిరుగుతున్న ఆలేరు మున్సిపల్ రాజకీయం
ఆలేరు, ఫిబ్రవరి 3 : యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు మున్సిపాలిటీలో రెండవ సాధారణ ఎన్నికలలో చైర్మన్ పీఠం ఎవరిని వరించనున్నదోనన్న చర్చ వేడివేడిగా జరుగుతున్నది. మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా తలపడనున్నాయి. రిజర్వేషన్ వివరాలు బీసీ మహిళగా ప్రకటించడంతో ఆశావాహుల్లో ఉత్కంఠత నెలకొంది. ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల్లో మొత్తం 13,632 ఓట్లర్లు ఉన్నారు. వీరిలో 6,671 పురుషులు, 6,960 మహిళలు, ఇతరులు ఒక్కరు ఉన్నారు. చైర్మన్ పీఠంపై అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు కూడా కన్నేసినట్టు తెలుస్తోంది. దీంతో పీఠంపై కూర్చునే బీసీ మహిళ ఎవరనేది ఉత్కంఠగా మారిపోయింది.
కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు...
మున్సిపాలిటీని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పురపాలికలోని మొత్తం12 వార్డులను గెలిచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. నియోజకవర్గంలో వివాదరహితుడిగా జనం మెప్పు పొందిన ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు బీర్ల ఐలయ్య నేతృత్వంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పార్టీ అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకుంది. ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆలేరు మున్సిపాలిటీ కావడంతో చేజిక్కించుకోవడానికి ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటు న్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే ఇటీవల కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అయితే ఎంతవరకు సఫలీకృతులవుతారనేది చూడాల్సి ఉంది.
మాజీ ఎమ్మెల్యేకు అనుకూలించేనా...?
బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. అయితే, శాసనసభ ఎన్నికల్లో పరాజయం తర్వాత మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు, కార్యకర్తలకు రైతుల సమస్యలకు అందుబాటులో ఉండటం ఈ ఎన్నికల్లో అనుకూలంగా మారే అవకాశం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమకు తోడ్పడుతాయని బీఆర్‌ఎస్ నాయకులు భావిస్తున్నారు. వీరి కోరికలు ఎంతవరకు నెరవేరుతాయి అనేది వేచి చూడాలి.
పావులు కదుపుతున్న బీజేపీ..
మున్సిపాలిటీలో పాగా వెయ్యాలని చూస్తుంది.పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసినట్టు విశ్వసనీయ సమాచారం ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని బిజెపి ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వ పథకాలను బలంగా ప్రచారం చేయడం ద్వారా లబ్ధి పొందాలని పట్టణ ప్రజలు విశ్లేషిస్తున్నారు.
నామినేషన్ల విత్ డ్రా
అన్ని ప్రధాన పార్టీలలో ఒక్కొక్క వార్డులో ప్రధాన పార్టీ అభ్యర్థులు పార్టీలోని అసమ్మతి నేతలు కూడా నామినేషన్ వేశారు, పోటీ చేసే అన్ని పార్టీల అభ్యర్థులకు బీ ఫామ్ లు ఇచ్చారు. అయితే అసమ్మతి నేతలను బుజ్జగించి వారికి అనువైన నామినేట్ పదవులు ఇస్తామని వాగ్దానం చేసి నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేశారు. అయినప్పటికీ ఒకరిద్దరూ పోటీలోనే ఉండడం గమనార్హం. ఏది ఏమైనా ఆలేరు చైర్మన్ పీఠంను అధిరోహించేది ఎవరు అనేది తేలాలంటే ఎన్నికలు ముగిసే వరకు ఆగాల్సిందే.