డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి అన్ని పార్టీలు సహకరించాలి
డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్
మేడ్చల్, మే 22 (విజయ క్రాంతి): జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి అన్ని పార్టీల నాయకులు సహకరించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్ సమీపంలోని జిల్లా ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జవహర్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్ ప్రధాన సమస్యగా తయారైంది అన్నారు. దీనివల్ల వాతావరణంతో పాటు భూగర్భ జలాలు కలుషితమై ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు.
హైదరాబాద్ మహా నగరానికి చెందిన మొత్తం చెత్తను ఇక్కడికే తరలిస్తున్నారని అన్నారు. రాంకీ సంస్థ ఒప్పందం ప్రకారం చెత్తను రీసైక్లింగ్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ఎంపీగా పనిచేసినందున ఈ సమస్యపై అవగాహన ఉందని, సమస్య పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం సూచించారని, అన్ని పార్టీలు, ప్రజలు, జేఏసీ నాయకుల అభిప్రాయాలు అధికారులు తీసుకున్నారని తెలిపారు. చెత్తను మొత్తం ఒకే దగ్గరికి తరలించకుండా ఎక్కడికక్కడ రింగ్ రోడ్డు సమీపంలో 10 డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు.
ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అన్ని పార్టీల నాయకులు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం విషయం ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి నాయకత్వంలో తాము పని చేస్తామని ఆయన స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బొంగునూరు శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్, అలియాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి, ఆర్టిఏ నెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






