12 July, 2026 | 1:37 AM

మంత్రి పొన్నంపై ఆరోపణలు తగదు

10-06-2024 01:43 AM

టీపీసీసీ ఓబీసీ కో ఆర్డినేటర్ తౌటం రవీందర్

హనుమకొండ, జూన్ 9 (విజయక్రాంతి): బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌పై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చేసిన అసత్యపు ఆరోపణలను టీపీసీసీ ఓబీసీ కోఆర్డినేటర్ తౌటం రవీందర్ ఖండించారు. ఆదివారం హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆగ్రహానికి కాలి బూడిదైన బీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతున్న కౌశిక్‌రెడ్డి బూడిద రవాణాపై అర్థం లేని అసత్యపు ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. 38 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని అంచెలంచెలుగా ఎదిగిన పొన్నం నేడు మంత్రిగా నిబద్ధత, నిజాయితీతో పనిచేస్తున్నాడని చెప్పారు. అలాంటి నాయకుడిపై మాట్లాడే అర్హత కౌశిక్‌రెడ్డికి లేదన్నారు.

తనకు ఓట్లు వేయకుంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని ఓటర్లను పరోక్షంగా బెదిరించి అనైతికంగా గెలిచాడని ఎద్దేవాచేశారు. 2018లో కౌశిక్‌రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకుంటే ఎప్పుడో కనుమరుగయ్యే వాడని అన్నారు. కాంగ్రెస్ భిక్షతో రాజకీయంగా ఎదిగిన ఆయన కన్నతల్లి లాంటి పార్టీలో నీతి నిజాయితీతో కొనసాగుతున్న పొన్నం ప్రభాకర్‌పై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో బీసీ నాయకులు దేశిని ఐలయ్య గౌడ్, బాలస్వామి గౌడ్, రమేష్ గౌడ్, పొడేటి బిక్షపతి, నాంపల్లి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.