ఆదివాసీ నాయకులను పోలీసులు విడుదల చేయాలి
తెలంగాణ పౌరహక్కుల సంఘం డిమాండ్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 9 (విజయక్రాంతి) ః ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆదివాసీ సంఘటన్, మలూ వాసి బచావో పంచ్‌కు చెందిన నాయకులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు డిమాండ్ చేశారు.
సిలంగేర్ కాల్పుల ఘటన జరిగి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని 2024 జూన్ 8వ తేదీన కలెక్టర్, జిల్లా ఎస్‌పీ కలిసేందుకు వెళ్లిన సోడీ భీమా, మడకామ్ జోగా, మడకామ్ జోశన్‌ను పోలీసులు పోలంపల్లి వద్ద అదుపులోకి తీసుకొని సుక్మాకు తీసుకెళ్లారని తెలిపారు. సుక్మా జిల్లా జబ్బగట్ట నివాసి అయిన సోడీ భీమా ఆదివాసీ హక్కల కోసం పోరాడుతున్నాడని తెలిపారు. 2024 మే 19న హైదరాబాద్‌కు వచ్చి ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న హక్కుల ఉల్లంఘనలను తెలుగు మీడియాకు తెలియజేశారని ప్రకటనలో తెలిపారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పోలీసులు అనధికారికంగా అదుపులోకి తీసుకున్న ఆదివాసీ నాయకులను వెంటనే విడుదల చేయలని వారు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు.






