18-09-2025 06:01:28 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): పండుగల ద్వారా సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండుగ వాతావరణం సమాజంలో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి(Alphores Chairman Narender Reddy) అన్నారు. స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో తెలంగాణ కళావైభవాన్ని చాటి చెప్పే విధంగా ఆకర్షణీయంగా ఏర్పాటు చేసినటువంటి బతుకమ్మ ఉత్సవంకు ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి దుర్గమాత చిత్రపటానికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్తుందని, సమాజంలో ఆనంద ఉత్సవాలకు బీజం వేస్తుందని తెలిపారు. ఈ పండుగకు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకత ఉన్నదని ఈ పండుగ దేశ విదేశాల్లో రెట్టింపు ఉత్సాహంతో నిర్వహించుకోవడం చాలా హర్షించదగ్గ విషయమని మరియు ఈ పండగ పల్లె వాతావరణం కళ్లకు కట్టే విధంగా కళకు నిదర్శనమని అభివర్ణించారు. వేడుకలలో భాగంగా చిన్నారులు ఆడిన బతుకమ్మ విధానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా వివిధ రూపాలలో బతుకమ్మలను తయారు చేసి ఆహుతులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు & విద్యార్థులు పాల్గొన్నారు.