18-09-2025 06:04:03 PM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్..
కామారెడ్డి (విజయక్రాంతి): వరదలతో వరి పొలాల్లో ఇసుక మేటలను వెంటనే తొలగించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్(District Collector Ashish Sangwan) ఆదేశించారు. గురువారం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బూరుగు గిద్ద గ్రామంలో వరద బాధిత రైతులను పరిస్థితిని పరిశీలించారు. వరద బాధిత రైతులకు లబ్ది కలిగేలా పొలాలలో వేసిన ఇసుక మేటల తొలగింపు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ అధికారులను ఆదేశించారు. ఇటీవల సంభవించిన అధిక వర్షాల సమయంలో వచ్చిన వరదలతో ఇసుక మేట వేసిన రైతు సభావత్ లక్ష్మి వారి పొలంలో ఈజీఎస్ ద్వారా చేపట్టిన ఇసుకమేటల తొలగింపు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధిత రైతుతో మాట్లాడి అధైర్య పడవద్దని భరోసా కల్పించారు. మీ పొలంలో ఇసుక మేటల తొలగింపునకు ఈజీఎస్ ద్వారా ఉపాధి హామీ కూలీలకు 1 లక్ష 21 వేల రూపాయల కూలీ డబ్బులను చెల్లించి ఈ పొలంలో ఉన్న 1200 క్యూబిక్ మీటర్ల ఇసుకను పూర్తిస్థాయిలో తొలగిస్తామని తెలిపారు.
అధిక వర్షాలతో సంభవించిన వరదల వలన పంట పొలాల్లో వేసిన ఇసుక మేటల వలన నష్టపోయిన బాధిత రైతులకు అత్యధికంగా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లింగంపేట మండలంలోని 41 గ్రామాలలో సుమారు 287 ఎకరాలలో ఇసుక మేట వేయడం జరిగిందని వెంటనే ఎంత ఇసుక మేట వేసిందో కొలిచి పూర్తిస్థాయిలో ఇసుకను తొలగించి మళ్లీ పంటలు వేసుకునేలా పొలాలను సిద్ధం చేయాలని, తొలగించిన ఇసుకను ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మరియు ఇతర ప్రభుత్వ నిర్మాణాలకు ఉపయోగించాలని ఎంపీడీవో నరేష్ ను ఆదేశించారు. ఇసుక మేటల తలగింపు కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని డిఆర్డిఓ సురేందర్ కు సూచించారు. మళ్లీ ఇలాంటి భారీ వర్షాలు కురిస్తే పొలాలలో ఇసుక మేటలు వేయకుండా చేపట్టవలసిన పనులను పరిశీలించవలసిందిగా అధికారులకు సూచించారు. పంట నష్టం వివరాలను పూర్తిస్థాయిలో సేకరించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ సిఇ శ్రీనివాస్ తో ఫోన్లో మాట్లాడి అధిక వర్షాలతో తెగిపోయిన ఊరకుంట చెరువు, సోమ్లా నాయక్ చెరువు, కొండెంగల చెరువు, మల్లారం పెద్ద చెరువులతో పాటు జిల్లా వ్యాప్తంగా దెబ్బ తిన్న అన్ని చెరువుల మరమత్తు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని, ప్రతిరోజు ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట ఎల్లారెడ్డి ఆర్టీవో పార్థసింహారెడ్డి, వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి, రెవెన్యూ తదితర శాఖల మండల, గ్రామస్థాయి అధికారులు పాల్గొన్నారు.