17 August, 2026 | 2:27 AM

ప్యాకెట్ పాలు ఎరుగని అల్లికోరి

17-08-2026 01:47 AM
  1. ఆ గ్రామం నిండా దేశీ ఆవులే
  2. పాలను అమ్మరు.. కొనరు
  3. గ్రామస్థులంతా కలిసి పంచుకుంటారు

ఆదిలాబాద్/ఉట్నూర్, ఆగస్టు 16 (విజయక్రాంతి): ప్రస్తుత సమాజంలో పశు సంప ద తగ్గుతూ వస్తున్న తరుణంలో పట్టణలే కాకుండా పల్లెల్లో సైతం ప్యాకెట్ పాల విక్రయాలు జోరందుకుంటున్నాయి. మారు మూల అడవి ప్రాంతంల్లో సైతం ప్యాకెట్ పాలే వాడుతున్నారంటే వాటి ప్రభావం ఏ మేరకు ఉందో అర్థం అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ఆదివాసీ గ్రామంలో ఇంటింటా ఆ వులను పెంచుతూ... ఆ పాలను వినియోగించడంతో పాటు పెరుగును తయారు చేసుకు ని ప్రతి ఇంట ఉపయోగిస్తున్నారు.

ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అల్లికోరి గ్రా మ పంచాయతీ కేంద్రంలో సుమారు 50 మంది ఆదివాసి గోండు గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. ఈ గ్రామంలో ప్రతి ఇంటిలో దేశీ ఆవులను పెంచుకుంటున్నారు. ఈ గూ డెంలో 205 ఆవులతో పాటు ప్రతి ఇంటికి ఎడ్ల జత ఉండటం విశేషం. ఈ ఆవులను అడవిలో మేపేందుకు గ్రామస్తులందరూ కలిసి ముగ్గురు పశువులకాపరులను నియమించుకున్నట్లు గ్రామ పటేల్ గంగారాం తెలిపారు.

ఆవుల నుంచి సేకరించిన పాలను అందరూ కలిసి పంచుకుంటారే తప్పా విక్రయించరు. ఆ గ్రామంలో ప్యాకెట్ పాలను కొనుగోలు చేయడం, వినియోగించడం తెలియదు. పశువుల మూత్రం, పేడను సైతం ప్రతి రైతు తమ చేనుల్లో ఎరువుగా ఉపయోగించుకుంటారు. పశువుల పేడ కోసం నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల నుంచి వచ్చే వారికి అమ్మవద్దని గ్రామంలో తీర్మానం చేశారు. తక్కువ మోతాదులో రసాయన ఎరువులను వాడుతారు.