నిరుద్యోగ యువతకు ఉద్దీపన ఆధ్వర్యంలో ఉచిత పోటీ పరీక్షల శిక్షణ
శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన ఉద్దీపన చైర్మన్, ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల (నకిరేకల్), ఆగస్టు 16: ఉద్దీపన ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నకిరేకల్ పట్టణం లో నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన ఉచిత పోటీ పరీక్షల శిక్షణా శిబిరాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే, ఉద్దీపన ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్ వేముల వీరేశం ఆదివారం ప్రారంభించారు. అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు 3 నెలల పాటు ఉచితంగా శిక్షణ అందించనున్నామని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో ఉద్దీపణ చైర్మన్ వేముల వీరేశం మాట్లాడుతూ ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ను 2015లో ప్రారంభించామని, అప్పటి నుంచి పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, నకిరేకల్ పట్టణంలో ఉద్దీపణ పాఠశాల ఏర్పాటు చేసి ఉచిత విద్య అందిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా సమయంలో కషాయ కేంద్రాలు, అవసరమైన కిట్ల పంపిణీ చేశామని, మృతుల అంత్యక్రియల్లో కూడా దగ్గరుండి మానవతా సేవలు అందించామని గుర్తు చేశారు.
నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం, నకిరేకల్ పట్టణంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఉచిత శిక్షణ పొందుతున్న ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివి పోటీ పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఆకాంక్షించారు. నిరుద్యోగ యువతకు అండగా నిలిచి, లక్ష్య సాధనకు అవసరమైన సహకారం అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, సీనియర్ నాయకులు పూజర్ల శంభయ్య, చామల శ్రీనివాస్, నాగులవంచ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ బెల్లి యాదయ్య, ఆర్సీ రెడ్డి కోచింగ్ అధ్యాపకులు వేముల సైదులు, మండల పార్టీ అధ్యక్షుడు గాదగోని కొండయ్య, టౌన్ అధ్యక్షులు లింగాల వెంకన్న, ఉద్దీపన కోఆర్డినేటర్ చెరుకు సతీశ్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






