శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్
బాలుడు కోలుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధమని ప్రకటన
సినిమా ప్రతినిధి, విజయక్రాంతి: పుష్ప2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని ఆ చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ తెలుసుకున్నారు. శ్రీతేజ్ చికిత్స పొందుతున్న కిమ్స్ ఆసుపత్రిని అల్లు అరవింద్ బుధవారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన హాస్పిటల్ వైద్యాధికారులు, శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి బాలుడి ఆరోగ్యస్థితిని తెలుసుకున్నారు. శ్రీతేజ్ తల్లి రేవతి మృతిపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదో దురదృష్ట ఘటన అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘ఇప్పుడే హాస్పిటల్‌లో ఉన్న శ్రీతేజ్‌ను ఐసీయూలో చూశాను.
డాక్టర్లందరితోనూ మాట్లాడాను. అబ్బాయి రోజురో జు కు రికవరీ అవుతున్నాడు. 14 రోజులుగా ఆసుపత్రిలో తమ ఉన్న శ్రీతేజ్ ఆరోగ్యం గత 10 రోజులుగా బాగా మెరుగుపడినట్టు కనిపిస్తోందని, అయితే కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. శ్రీతేజ్ కోలుకోవడానికి ఏం చేయడానికైనా మేం సిద్ధంగా ఉన్నాం.
చాలా మంది అభిమానులు, బంధువులు, మిత్రులు అల్లు అర్జున్ ఎందుకు హాస్పిటల్‌కు వెళ్లలేదని అడుగుతున్నారు. దానికి కారణం.. తొక్కిసలాట జరిగిన మరుసటి రోజు ఉదయమే అర్జున్ హాస్పిటల్‌కు వెళదామనుకున్నాడు. కానీ హాస్పిటల్ అధికారులు, మీరు హాస్పిటల్‌కు వచ్చే కార్యక్రమం వాయిదా వేసుకోమని సూచించారు.
అది మాకు కరెక్ట్ అనిపించింది. అందుకే అర్జున్ రాలేదు. ఇక ఆ రోజే అర్జున్‌పై కేసు వచ్చింది. ఆ కేసులో లీగల్ టీమ్ హెడ్ నిరంజన్‌రెడ్డి, మీరు హాస్పిటల్‌కు వెళ్లకూడదు.. వారిని కలవకూడదని స్ట్రాంగ్‌గా చెప్పారు. ఆ తర్వాత మేము రావడానికి ఎన్నో నిబంధనలు ఎదురయ్యాయి. ఇక బన్నీ ఒక రోజు బాధపడుతూ ‘నేను చూడలేకపోయాను.. మీరైనా వెళ్లండి డాడీ అన్నాడు.
నేను ఇక్కడికి రావడానికి ముందు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ తీసుకున్నాను. ఈరోజు వచ్చాను. నాకు ఈ అనుమతి ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే పోలీస్ శాఖ వారికి, హాస్పిటల్ యాజమాన్యానికి, సీఈవో అభిమన్యు, మెడికల్ డైరెక్టర్ సంహిత్‌కు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని అన్నారు.






