26-05-2025 12:45:00 AM
చండూరు, మే 25 : గట్టుప్పల మండలం తేరటుప ల్లి గ్రామంలో యుపిఎస్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 1997 -98లో ఏడవ తరగతికి చెందిన పూర్వ విద్యార్థులు గురువులతో కలిసి ఆత్మీయ పలకరింపులు, ఆలింగాల నడుమ ఆనాటి మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు. కొంతమంది వ్యాపారం, మరి కొంతమంది ఉద్యోగాల్లో స్థిరపడగా ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు.
ఆనాటి విద్యార్థులు ఒకే చోట చేరడంతో సందడి నెలకొన్నది. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను శాలువాతో పూర్వ విద్యార్థులు సన్మానించారు. ఆ పాఠశాలకు ఆ స్కూల్ హెడ్మాస్టర్ చేతుల మీదుగా పూర్వ విద్యార్థులు బీరువాను బహుకరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.