calender_icon.png 16 February, 2026 | 12:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఐటి రూర్కీతో అమెజాన్ ఒప్పందం

15-02-2026 10:21:30 PM

వ్యవసాయ వ్యర్థాల నుండి వినూత్న ప్యాకేజింగ్ సామగ్రిని అభివృద్ధి చేయడానికి అమెజాన్ ఇండియా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. కలపేతర కాగితం సాంకేతికతను సృష్టించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. వర్జిన్ కలప గుజ్జుపై ఒత్తిడిని తగ్గించేందుకు, వ్యవసాయ వ్యర్థాలను దహనం చేయకుండా మళ్లించేందుకు ఈ సాంకేతికత తోడ్పడనుంది.  తేలికైనవే అయినప్పటికీ, ఈ బలమైన ప్యాకేజింగ్ పదార్థాలు సంప్రదాయ కలప గుజ్జు కాగితం లేదా ప్లాస్టిక్ సంచులకు బదులుగా తిరిగి వాడదగిన, ఇంట్లోనే కంపోస్ట్ చేయగల ప్రత్యామ్నాయాలను అందిస్తాయి.

ఈ పరిశోధన గోధుమ గడ్డి, బగాస్ వంటి పంట అవశేషాలను పేపర్ మెయిలర్స్ తయారీకి పనికొచ్చే అధిక-నాణ్యత గుజ్జుగా మార్చడంపై దృష్టి పెడుతుంది. ఇది సంప్రదాయ కాగితపు ప్యాకేజింగ్‌తో పోల్చదగిన పనితీరును కలిగి ఉంటుంది. ఇది వ్యవసాయ వ్యర్థాలను విలువైన ప్యాకేజింగ్ పదార్థంగా మార్చడం ద్వారా భారత దేశంలో పంట అవశేషాల దహనం తగ్గించడంలో సహాయపడుతుంది. అదే విధంగా, ఇది దిగుమతి చేసుకున్న వర్జిన్ కలప గుజ్జుపై ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుంది.

వ్యవసాయ అవశేషాలకు మార్కెట్‌ను అందించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయాన్ని సృష్టించవచ్చు. ఐఐటీ రూర్కీలోని పేపర్ అండ్ ప్యాకేజింగ్ టెక్నాలజీ విభాగంతో ఈ భాగస్వామ్యం 15 నెలల కాలానికి ప్రయోగశాల స్థాయిలో అభివృద్ధి, పరీక్షలతో ప్రారంభమవుతుంది. పనితీరు పరీక్షలు విజయవంతం అయిన తర్వాత, వచ్చే ఏడాది మధ్య నుండి చివరి నాటికి పారిశ్రామిక పరీక్షలు, ప్రక్రియ ధృవీకరణ,  వాణిజ్య ఉత్పత్తి దశలకు పురోగమించడానికి అమెజాన్ మద్దతు అందిస్తుంది.

భారతదేశం ఏటా దాదాపు 500 మిలియన్ టన్నుల మేరకు ఈ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుందినీ, వాటిని ప్యాకేజింగ్‌లో తిరిగి ఉపయోగించడం ద్వారా, సంప్రదాయ పదార్థాలపై ఆధార పడటాన్ని తగ్గించడమే లక్ష్యమని అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ చెప్పారు. స్వచ్ఛ భారత్, స్టార్టప్ ఇండియా, నేషనల్ రిసోర్స్ ఎఫిషియన్సీ పాలసీ వంటి ప్రభుత్వ లక్ష్యాలను సాకారం చేసుకునే దిశగా ఐఐటీ రూర్కీ- అమెజాన్ మధ్య ఈ సహకారం ఒక ముందడుగని ఐఐటీ రూర్కీ డైరెక్టర్ ప్రొఫెసర్ కమల్ కిషోర్ పంత్ అన్నారు.