జిల్లెల్లలో అంబేద్కర్ జయంతి వేడుకలు
– రాజ్యాంగ మహత్త్వాన్ని గుర్తుచేసిన నేతలు
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దుబ్బాక రజిత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం దేశ ప్రజలకు సమాన హక్కులు, న్యాయం అందించిందని తెలిపారు.
రాజ్యాంగం వల్లే సామాన్య ప్రజలు తమ హక్కులను పొందగలుగుతున్నారని, దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడిందని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాట్ల మధు, దుబ్బాక రమేష్ తదితరులు పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




