గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్ట్ షాపులు
మామూళ్ల మత్తులో అధికారులు
కొండపాక, జూన్ 18: రోజురోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్ట్ షాపులు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు బెల్టు షాపులను నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని వివిధ గ్రామాలలో ఒక్కో గ్రామంలోని మూడు నుంచి ఐదు బెల్ట్ షాపులు ఉన్నాయని ప్రజలు మద్యానికి బానిసలై ఇంట్లో ఉన్న వారిని వేధిస్తున్నారని మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మద్యం షాపు యజమానులే బెల్టు షాపు నిర్వహించే వారిని ప్రోత్సహిస్తున్నారని, ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లు అమ్ముతూ ఆదాయాన్ని కూడబెట్టుకుంటున్నారని అన్నారు.
విషయం తెలుసుకున్న అధికారులు చర్యలు తీసుకోకుండా మద్యం షాపు, బెల్టు షాపు యజమానులతో కుమ్మక్కై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొండపాక మండలంలోని వివిధ గ్రామాలలో అక్రమ మద్యం ఏరులై పారుతుంది. ప్రభుత్వ ఆదాయం కోసం కాకుండా మద్యం, బెల్ట్ షాపు యజమానుల జేబులు నింపేందుకు మామూళ్ల దాహాన్ని నింపడానికి అక్రమ మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చేర్యాల ఎక్సైజ్ శాఖ కార్యాలయం అతి సమీపంలో బెల్ట్ షాపులు కొనసాగడం ఆలోచించదగ్గ విషయం.
మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం
ప్రభుత్వం కేటాయించిన మద్యం షాపుల్లో ఉండాల్సిన మద్యం సీసాలు బెల్ట్ షాపులలో ఉండడం, ఎక్సైజ్ శాఖ అధికారులు ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం, శాంతి భద్రతల కంటే తమకు వచ్చే అమ్య్‌ంయాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నా యి. మద్యం షాపు యజమానులు బెల్ట్ షా పు యజమానులతో కుమ్మక్కై ఎమ్మార్పీ కంటే రూ.20 నుంచి రూ.70 వరకు అధికంగా అమ్ముతు మందుబాబుల జేబులకు చిల్లులు పొడుస్తున్నారన్నారు.
యువత భవిష్యత్తుపై ప్రభావం
రోజంతా మద్యం అందుబాటులో ఉండడంతో యువతలో వ్యసనం పెరుగుతుంది. అప్పులు చేసుకుని మరి తాగు తున్నారు. స్నేహితుల మధ్య గొడవలు ఇది యువత ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్యం ప్రభావం లో కుటుంబాలలో కలహాలు పెరుగుతున్నాయని, సంపాదించిన డబ్బంతా మద్యం కోసం ఖర్చు అవుతుండటంతో కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని మహిళలు, మహిళా సంఘాల సభ్యులు అంటున్నారు. అక్రమంగా వెలిసిన బెల్ట్ షాపులను మూసివేయాలని కోరుతున్నారు.






