19 June, 2026 | 1:31 AM

‘గార్బేజ్ యార్డు’లో డీజిల్ దొంగలు

19-06-2026 12:00 AM
  1. ఎల్బీనగర్ జోనల్‌లోని వాహనాల్లో డీజిల్ చోరీ 
  2. ఇసుక లారీలకు విక్రయిస్తున్న ఉద్యోగులు
  3. పర్మినెంట్ ఉద్యోగి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల దొంగాట

ఎల్బీనగర్, జూన్ 18 : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ లోని ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పరిధిలో డీజిల్ దొంగతనం జరుగుతుంది. ఎల్బీనగర్ సర్కిల్ కార్యాలయంలోని పార్కింగ్ యార్డులో గార్బేజ్  వెహికిల్స్ పార్కింగ్ యార్డులో కిందిస్థాయి ఉద్యోగులు డీజిల్ చోరీకి పాల్పడుతున్నారు.  పర్మినెంట్ ఉద్యోగి, డ్రైవర్ మరో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఇద్దరు కలిసి యథేచ్ఛగా గార్బేజ్ వాహనాల్లో డీజిల్ ను దొంగిలించి, ఇసుక లారీలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

ఇంత జరుగుతున్నా డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ ఇంజినీర్ కండ్లు మూసుకొని ఉంటున్నారు. ప్రతి వాహనానికి లెక్క చూసి డీజిల్ కూపన్లు ఇచ్చే ఏఈ ఏ లెక్కన ప్రతి రోజూ గార్బేజ్ వాహనాలకు డీజిల్ కూపన్లు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పర్మినెంట్ ఉద్యోగి కృష్ణ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి శ్రీశైలం ఇద్దరు కలిసి ఉదయం వేళ 5 గంటల సమయంలో గార్బేజ్ వాహనాల్లో డీజిల్ ను క్యాన్లలో నింపి, బహిరంగ మార్కెట్లో ఇసుక లారీలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

ఇప్పటికైనా డీజిల్ దొంగల భరతం పట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.  హాయత్ నగర్ సర్కిల్ పర్మినెంట్ ఉద్యోగి డ్రైవర్ కృష్ణ  కు నెలకు లక్ష నలభై వేలు జీతం ఉండగా,మరో  ఔట్సోర్సింగ్ ఉద్యోగి డ్రైవర్ శ్రీశైలంతో కలసి డీజిల్ చోరీ చేస్తున్నరని, వీరిని సస్పెండ్ చేయాలని గార్బేజ్ కార్మికులు కోరుతున్నారు.

ఉద్యోగం మానేసి.. తిరిగి వచ్చిన వ్యక్తికి సూపర్ వైజర్..

గార్బేజ్  లేబర్ గా విధుల్లో ఉండాల్సిన రాజు అనే ఔట్ సోర్సింగ్ కార్మికుడు ఒకప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అక్కడ పదవీకాలం పూర్తి చేసుకుని ఇప్పుడు జీహెచ్‌ఎంసీలో ఉద్యోగిగా చేరాడు. హయత్ నగర్  సర్కిల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏఈ దీపక్, వెహికిల్ ఇంచార్జి పర్మినెంట్ ఉద్యోగి  రహీం అండదండలతో  అతను సూపర్ వైజర్ గా చలామణి అవుతుండడం గమనార్హం. 

గతంలో ఓ గ్రామం ఉపసర్పంచ్ గా ఉండి కూడా ఔట్ సోర్సింగ్ లేబర్ గా జీతం పొందిన రాజు, ఇప్పుడు తిరిగి  సూపర్ వైజర్ గా చలామణి అవుతున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంఎంసీలో అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నయని  ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి దృష్టి సారించి  వెంటనే వీటిని అరికట్టాలని ప్రజలు,కార్మికులు కోరుతున్నారు.