12 April, 2026 | 2:06 AM

ఇరాన్ తెగువకు తలొగ్గిన అమెరికా

12-04-2026 12:00 AM

డాక్టర్ తిరునహరి శేషు :

ఫిబ్రవరి 28న అమెరికా సహకారం తో ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టిన తరువాత ప్రతిదాడులకు దిగిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనితో సహా చాలామంది కీలక నేతలు మరణించారు. అయినా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 39 రోజులు యుద్ధ కదనరంగంలో ఇరాన్ పోరాడిన తీరు ఒక విధంగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. యుద్ధం ప్రారంభమైన తర్వాత నాలుగు లేదా ఐదు వారాల్లో యుద్ధాన్ని ముగించేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.

కానీ, చివరికి ట్రంప్‌ను గౌరవప్రదంగా ఈ యుద్ధం నుంచి ఎలా బయటపడాలో పాలుపోనిస్థితికి తేవటంలో ఇరాన్ సఫలీకృతమైంది. ‘ఈ యుద్ధాన్ని మేము మొదలుపెట్టలేదు. ఇది మేము కోరుకున్న యుద్ధం కాదు. మాపై రుద్దిన యుద్ధం కాబట్టి, మొదలుపెట్టిన వారే ముగించాలి’ అని ఇరాన్ మొదటి నుం చి వాదిస్తూనే ఉన్నది. 8 ఏళ్లు కొనసాగిన ఇరాన్ యుద్ధం, ఇరాక్ కువైట్‌ని ఆక్రమించే సందర్భంలో జరిగిన గల్ఫ్ యుద్ధం వలన తాత్కాలికంగా ఎదురైన ఇబ్బందులను ప్రపంచం అధిగమించగలిగింది.

కానీ, ఇజ్రాయెల్ అమెరికాతో సం యుక్తంగా ఇరాన్‌పై దాడులకు దిగటం, ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో 39 రోజులు కొనసాగిన యుద్ధం ప్ర పంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూ పింది. ముడిచమురు బ్యారెల్ ధర 100 డాలర్లకి పైగా పెరగటంతో యుద్ధాన్ని అయిష్టంగానైనా ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆ ప్రయత్నాలలో భాగంగా టర్కీ, ఈజిప్ట్, పాకిస్థాన్, చైనాల మధ్యవర్తిత్వంతో యుద్ధాన్ని రెండు వారాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు ఏప్రిల్ 8న ప్రకటించడం, ఇరాన్ 10 ప్రతిపాదనలను అమెరికా ముందు పెడుతూ అంగీకారం తెలపడంతో సమస్య పరిష్కారానికి మొదటి అడుగు పడినట్లుగానే భావించాలి.

ఇరానియన్ల వ్యూహం,- తెగువ..

హోర్ముజ్ జలసంధిని తెరిచి తమతో ఒప్పందం కుదుర్చుకోకపోతే ఒక్క రాత్రిలో ఇరాన్ నాగరికతను ధ్వంసం చేస్తామని, ఇరాన్‌ను రాతియుగంలోకి పంపిస్తామని అగ్రరాజ్యాధినేత హూంకరింపులకి  భయపడకుండా తమ దేశాన్ని కాపాడుకోవడానికి ఇరానియన్లు చూపించిన తెగువ, దేశభక్తి అగ్రరాజ్యాన్ని వెనకడుగు వేయించిందనే చెప్పాలి. ఇరాన్‌పై దాడులు ప్రారంభమైన మొదటిరోజే సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీతో సహా 38 మంది కీలక నాయకులు మరణించారు.

39 రోజుల యుద్ధం లో రోజుకొక ముఖ్య నాయకుడు మరణించినా, దేశంలో ఏర్పడిన నాయకత్వ సంక్షో భం నుంచి బయటపడి 2005 తరువాత దేశంలో ఐఆర్‌జీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న ముజాయిక్ వ్యవస్థతో ఇజ్రాయెల్, అమెరికా దాడులను తట్టుకొని నిల బడటమే కాదు, ఇరాన్ తనని తాను రక్షించుకోటానికి ఎదురుదాడి చేసిన తీరు సరికొ త్త  యుద్ధతంత్రంగానే కనబడింది.

యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్‌ని లొంగదీసుకోవటానికి ఇజ్రాయెల్, అమెరికా సంయు క్తంగా వేలాది క్షిపణులతో, ఫైటర్ జెట్‌లతో దాడి చేస్తుంటే, ఇరాన్ మాత్రం తన వద్ద ఉన్న పరిమిత ఆయుధ వనరులతో ము ఖ్యంగా చౌకైన డ్రోన్లతో, క్షిపణులతో ప్రతిదాడులు చేస్తూ వచ్చింది.

సౌదీ, కువైట్, ఖతార్, యమన్‌లలోని ఆయిల్ రిఫైనరీలపై దాడు లు చేస్తూ వ్యూహాత్మకంగా హోర్ముజ్ జలసందిని మూసివేయడంతో ప్రపంచవ్యా ప్తంగా, ముఖ్యంగా దక్షిణాసియాలో ముడిచమురు సంక్షోభం ఏర్పడేలా ఇరాన్ వ్యూ హం రచించడంతో యుద్ధం ఆపాలని అమెరికాపై ప్రపంచ దేశాల ఒత్తిడి పెరిగింది.

ఇరాన్ వ్యూహాత్మకంగా హోర్ముజ్ జలసంధిని రక్షణ కవచంగా వాడుకొని తనని తాను రక్షించుకొని దౌత్య మార్గాల ద్వారా ఒక విధంగా అమెరికాపై పైచేయి సాధించింది. యుద్ధంలో హోర్ముజ్‌ని గేమ్ చేంజ ర్‌గా మార్చడంలో ఇరాన్ ఎత్తుగడ ఫలించింది. హోర్ముజ్‌ని తెరిచి  తమతో ఒప్పం దం చేసుకోకపోతే 48 గంటలలో ఇరాన్‌కి నరకమంటే ఏమిటో చూపిస్తామని, రాతియుగంలోకి నెట్టివేస్తామని, వారి నాగరి కతను ధ్వంసం చేస్తామని, కనీవినీ ఎరుగని విధ్వంసానికి పాల్పడతామని ట్రంప్ హెచ్చరించారు.

ఆయిల్ రిఫైనరీలపైనే కాదు, విద్యుత్ కేంద్రాలు, వంతెనలు, మౌలిక వసతులను ధ్వంసం చేస్తామని, ఒక్క రాత్రిలో  ఇరాన్‌ని భస్మీపటలం చేస్తామన్న ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ ఎక్కడా వెనకడుగు వేయలేదు. ఇరాన్ అధ్యక్షుడు పెజస్కీయాన్ ఒక అడుగు ముందుకేసి తనతోపాటు కోటి 40 లక్షల మంది ఇరానియన్లు ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు.

అంతేకాదు, దేశంలో ఉన్న విద్యుత్ కేంద్రా లు, వంతెనలు, మౌలిక వసతులను కాపాడుకోవడానికి సిద్ధపడ్డ ఇరాన్ ప్రజలు మాన వహారాలుగా ఏర్పడి విద్యుత్ కేంద్రాలు బ్రి డ్జిల వద్దకు చేరుకోవటంతో ఏప్రిల్ 8న తప్పనిసరి పరిస్థితులలో అగ్రరాజ్యాధినేత అనివార్యంగా రెండు వారాలు యుద్ధ విరా మం ప్రకటించక తప్పలేదు. విపత్కర యుద్ధ పరిస్థితులలో ఇరానియన్లు చూపిన తెగువ, దేశభక్తికి ప్రపంచవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది.

 అమెరికా పైచేయి సాధించి ఉంటే? 

యుద్ధంలో అమెరికా పైచేయి సాధించి ఉంటే లేదా ఇరాన్‌లో అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వం కొలువుదీరి ఉంటే ప్రపంచంపై అగ్రరాజ్యం ఆధిపత్యం మరింత పెరిగేది. కానీ, ఇరాన్ మొక్కవోని ధైర్యంతో అగ్రరాజ్యాన్ని ఎదిరించి ట్రంప్ అహంకారంపై, ఆశలపై నీళ్లు చల్లింది. ఇప్పటికే పర్షియన్ గల్ఫ్‌లో అనేక సైనిక స్థావరాలు ఏర్పరచుకున్న అమెరికా.. ఇరాన్‌ని కూడా అక్రమిం చుకుంటే మిడిల్ ఈస్ట్‌లోని చమురు నిల్వలపై తన ఆధిపత్యం పెరిగేది.

వెనెజువెలా ఇరాన్‌లను తమ ఆధీనంలోకి తెచ్చుకొని చైనా, రష్యా, భారత్‌ని కట్టడి చేయాలనే ట్రం ప్ వ్యూహాలు బెడిసికొట్టాయి. వెనెజువెలా, ఇరాన్ దేశాలు చైనా, భారత్‌కి తమ ముడిచమురుని ఎగుమతి చేస్తున్నాయి. కాబట్టి ఇప్పటికే వెనెజువెలాని తమ ఆధీనంలోకి తీసుకున్న అమెరికా.. ఇరాన్‌ని కూడా తమ పాలన కిందికి తీసుకువచ్చి ప్రపంచ ఆర్థిక వేదికపై చైనా, భారత్‌ల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలనేది ట్రంప్ వ్యూహంగా కనిపి స్తోంది.

అమెరికా ఆధీనంలోకి  వెనెజువెలా వెళ్లిన తర్వాత క్యూబాలో ఆయిల్ కొరత వ లన చీకట్లు అలుముకున్న విధంగానే ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తిదారులైన వెనెజువెలా, ఇరాన్‌లను తమ ఆధీనంలోకి తీసుకొని చైనా, భారత్, రష్యాలను తమ దారికి తెచ్చుకోవాలనేది ట్రంప్ ఎత్తుగడగా కనిపిస్తోంది. ప్రపంచంలో ఆయిల్‌పై రష్యా గుత్తాధిపత్యాన్ని తగ్గించి, ఆ దేశాన్ని బలహీనపరచటం ఒక వ్యూహమైతే, వెనెజువెలా, ఇరాన్ చమురు దిగుమతులపై ఆధారపడిన చైనా, భారత్‌లను నియంత్రించాలనేది మ రొక ఎత్తుగడగా కనిపిస్తోంది.

యుద్ధానికి తాత్కాలికంగా విరామం ప్రకటించినా అమెరికా ముందు ఇరాన్ పెట్టిన పది ప్రతిపాదనలను అగ్రరాజ్యం ఎంతవరకు ఆమోదిస్తుందనే సందేహాలు కలుగు తున్నాయి. ఒకవైపు ఏప్రిల్ 11 నుంచి ఇస్లామాబాద్‌లో దౌత్య చర్చలు ప్రారంభమవు తుండగానే, మరొకవైపు లెబనాన్‌లోని హి జ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ ఐడీఎఫ్ ద ళాలు దాడులు చేయటం, హిజ్బుల్లా చీఫ్ నయీమ్ కాసింని మట్టుబెట్టడం శాంతిచర్చలకు అవరోధంగా మారనుందా? అనే అను మానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

హో ర్ముజ్ ఇరాన్ నియంత్రణలో ఉండటానికి అమెరికా అంగీకారం తెలుపకపోతే చర్చల లో పీఠముడి పడుతుంది. కాబట్టి ఇరుపక్షా లు పట్టుదలకు పోకుండా  సహృద్భావ వా తావరణంలో శాంతి చర్చలు ఫలప్రదమై యుద్ధం ఆగిపోవాలని ప్రపంచం మొత్తం కో రుకుంటున్నది. యుద్ధం ఒక్క ట్రంప్ లేదా బెంజిమన్ నెతన్యాహూ లేదా ఇరాన్ ఐఆర్‌జీసీలకు సంబంధించినది మాత్రమే కాదు, అది ప్రపంచ ప్రగతికి  గొడ్డలిపెట్టుగా మారే అంశం. ప్రపంచ మానవాళి శ్రేయస్సు దృ ష్ట్యా రెండు దేశాలు పరస్పర అంగీకారానికి వచ్చి యుద్ధం ఆపివేయాలని ఆకాంక్షిద్దాం. 

 వ్యాసకర్త సెల్: 9885465877