12 April, 2026 | 3:13 AM

ఫార్మాసిటీ రద్దు కాలేదు!

12-04-2026 01:31 AM

మాటతప్పిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, కాంగ్రెస్ నేతలు

ఫార్మాసిటీ రద్దుకాలేదంటూ హైకోర్టులో ప్రిన్సిపల్ సెక్రటరీ అఫిడవిట్ 

ఫార్మాసిటీ, ఫ్యూచర్ సిటీలపై ప్రజల్లో తీవ్ర గందరగోళం

ఫార్మాసిటీ భూములనే ఫ్యూచర్ సిటీకి ఉపయోగిస్తే చట్ట విరుద్ధమే

హైదరాబాద్, ఏప్రిల్ 1౧ (విజయక్రాంతి): సుమారు 19,000 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రజలపై ఒత్తిడితెచ్చి ఏర్పాటుచేస్తున్న  ఫార్మాసిటీని రద్దు చేస్తామంటూ గతంలో కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటలు.. చేసిన వాగ్దానాలు అన్నీ ఉత్తిదేనంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా ఫార్మాసిటీ ఏర్పాటుకోసం రైతుల నుంచి 19 వేల ఎకరాలను సేకరించాలని నోటిఫికేషన్ జారీచేశారు. అయితే 2013 భూసేకరణ చట్టం ద్వారా కాకుండా.. ఆ చట్టానికి సవరణలు చేసి, 2016 భూసేకరణ సవరణల చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.

ఈ చట్టం ద్వారా ప్రభుత్వం ప్రజలపై ఒత్తిడి తీసుకొచ్చి.. సరైన నష్టపరిహారం ఇవ్వకుండా అప్పటి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని, భూములనే నమ్ముకున్న రైతులు, రైతుల భూములపైనే ఆధారపడి బతుకుతున్న వేలాది మంది వ్యవసాయ కూలీలు, ఇతర చిరు వ్యాపారాలు చేసుకునేవారి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుండటంతో అనేక రకాలుగా ప్రజలు నిరసనలు, ధర్నాలు చేశా రు.

ఈ నేపథ్యంలో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2013 భూసేకరణ చట్టాన్ని తీసుకొస్తామన్నారు. అలాగే ఫార్మాసిటీని రద్దుచేసి.. ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను దూరంచేస్తామని, వారందరికీ న్యాయం చేస్తామంటూ అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితర కాంగ్రెస్ నేతలు బాధితులను కలిప్పుడు, సభల్లో వాగ్దానం చేశా రు. పైగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో దీనిని చేర్చి..

అమలు చేస్తామని కూడా స్పష్టం చేశారు. అయితే కొద్ది రోజుల క్రితం ఫార్మాసిటీని రద్దుచేశామని, ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించు కుంది. కానీ ఫార్మాసిటీ రద్దు కాలేదని, దాని పై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని, ఫార్మాసిటీ కోసం చేస్తున్న భూసేకరణ ఇంకా కొనసాగుతోందని సాక్షాత్తు రాష్ట్ర రెవె న్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ రాష్ట్ర హైకోర్టులో దాఖలుచేసిన అఫిడవిట్‌లో చెప్పడంతో ఫార్మాసిటీ బాధితులంద రూ భగ్గుమంటున్నారు.

బాధితుల్లో ఆగ్రహం.. 

కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందొకటి.. చేసేదొకటని బాధిత రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎన్నికలకంటే ముందు బాధిత రైతులతో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం, ఫార్మాసిటీని రద్దు చేస్తామంటూ చెప్పిన నేతలు.. ఇప్పుడు మొహాలు చాటేయడంపై వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బయటకు ఫార్మాసిటీ ఏర్పాటుకోసం జారీచేసిన జీవోను రద్దుచేశామంటూ చెబుతూనే, మరోవైపు ప్రభుత్వం తరఫున కోర్టులో ఫార్మాసిటీ జీవోను రద్దు చేయలేదని చెప్పడంపై మండిపడుతున్నారు.

ఫ్యూచర్ సిటీకి ఎలా వాడుతారు..? 

ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పారు. జీవో 31ని రద్దు చేశామన్నారు. కానీ ఇప్పటికీ రద్దు చేయలేదు. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్‌మిట్టల్ 2024 సెప్టెంబర్‌లో హైకోర్టులో ఇచ్చిన అఫిడవిట్‌లోనే రద్దు చేయలేదని స్పష్టంగా పేర్కొన్నారు. అసలు ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములను ఫ్యూచర్ సిటీ కోసం ఎలా ఉపయోగిస్తారు. ఇది చట్ట విరుద్ధం. ఒక అవసరం కోసం తీసుకున్న భూములను అందుకే ఉపయోగించాలి.

ఫ్యూచర్ సిటీ కోసం భూములు ఉపయోగించుకోవాలంటే.. ముందుగా ఫార్మాసిటీ జీవోను రద్దు చేయాలి. తరువాత ఫ్యూచర్ సిటీ కోసం భూసేకరణ ప్రక్రియను మొదటి నుంచి మొదలుపెట్టాలి. పైగా 2013 భూసేకరణ చట్టం ప్రకారం చేయాల్సిఉంటుంది. కాంగ్రెస్ పార్టీ 2013 భూసేకరణ చట్టాన్ని తీసుకొస్తామని, అమలుచేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. భూసేకరణ వల్ల ప్రభావితమయ్యే అంశాలపై అధ్యయనం చేయాలి. పైగా నాలుగు గ్రామాల్లో స్టే ఉంది. కానీ అధికారులు ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములనుకూడా ఫ్యూచర్‌సిటీ కోసం, గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం ఉపయోగిస్తున్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం.

కవుల సరస్వతి, సామాజిక కార్యకర్త

మా అసైన్డ్ భూముల్లో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మిస్తున్నారు..  

మాకు తాతల నుంచి వచ్చిన అసైన్డ్ భూమి సుమారు 13.5 ఎకరా లు ఉంది. ఇందులో దాదాపు 9 ఎకరాలకు పాస్‌బుక్ ఉంది. ఇందులో 5 ఎకరాల భూమిని ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం తీసుకుంది. ఒక్కో ఎకరానికి రూ. 8 లక్షలు నష్టపరిహారం ఇచ్చింది. కానీ ఫార్మాసిటీ కోసం కా కుండా.. గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం చదు ను చేస్తున్నారు. మా నుంచి తీసుకున్న అసైన్డ్ భూముల్లో పెద్దపెద్ద టిప్పర్లు, బుల్డోజర్లు, ప్రొక్లెయినర్లు పెట్టి రోడ్డు పనులను చేస్తున్నారు.

 పంతం మధు, రైతు, కుర్మిద్ద, యాచారం మండలం 

హైకోర్టులో అఫిడవిట్.. 

2023 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే.. గతంలో ఇచ్చిన హామీలను, వాగ్దానాలను విస్మరించిందని.. వాటిని పట్టించుకోకుండా.. ఫార్మాసిటీ బాధితులను.. ఫ్యూచర్‌సిటీ పేరుతో భూము లను సేకరిస్తున్నారంటూ యాచారం, మంచాల, మహేశ్వరం, కందుకూరు, కడ్తాల్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్ మండలాల్లో భూసేకరణ బాధిత రైతు లు అంటున్నారు.

గతంలో కాంగ్రెస్ పార్టీ రాగానే ఫార్మాసిటీ జీవోను రద్దుచేసి న్యాయం చేస్తామని చెప్పిన ప్రభు త్వం.. ఆ దిశగా చర్యలు తీసుకోలేదంటున్నారు. పైగా.. సాక్షాత్తు రాష్ట్ర రెవె న్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ రాష్ట్ర హైకోర్టులోనే ఫార్మాసిటీని రద్దు చేయలేదంటూ అఫిడవిట్‌లో పేర్కొనడాన్ని వారు ఎత్తిచూపిస్తునాన్రు. రైతులు వేసిన పలు కేసులకు సంబంధించి 2024 సెప్టెంబర్ 19 నాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉన్న నవీన్‌మిట్టల్ రాష్ట్ర హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.

అందులో ఫార్మా సిటీకి సంబంధించి జారీచేసిన జీవోఎంస్ నెం. 31ను రద్దు చేయడానికి ఎలాంటి నిర్ణ యం తీసుకోలేదని, ప్రభుత్వం జీవో 31ని అమలు చేయడానికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటుందని, భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం లేదంటూ తేల్చి చెప్పడం గమనార్హం.

రేవంత్‌రెడ్డి, భట్టి వాగ్దానం..

గత బీఆర్‌ఎస్ హయాంలో చేపట్టిన ఫార్మాసిటీ భూసేకరణ సమ యంలో కాంగ్రెస్ నాయకులు రేవం త్‌రెడ్డి, భట్టి విక్రమార్కలతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలందరూ ఫార్మాసిటీ బాధిత రైతులకు అండ గా ఉన్నారు. వారికి ఫార్మాసిటీ జీవోను రద్దుచేసి న్యాయంచేస్తామని చెప్పారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. సోనియమ్మ రాజ్యంలో న్యాయం జరుగుతుందని బాధితులకు వాగ్దానం చేశారు. అప్పుడు వారు చేసిన వాగ్దానాలు, హామీలు ఏమిటో.. వారి మాటల్లోనే..

‘యాచారం, కందుకూరు చుట్టుపక్కల మండలాల్లో 20 వేల ఎక రాల్లో రైతులకు చెందిన పచ్చని పం ట పొలాల భూములను కేసీఆర్ రూ. 14 లక్షలకు, రూ. 16 లక్షలకు గుంజుకుంటున్నడు. వాటిని రూ. 1.25 కోట్లకు కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకుంటున్నడు. రైతు రూ. కోట్లు సంపాదించడానికి వ్యవసాయం చేయడు. రైతు అనేవాడు బీరువాల్లో బంగారం నింపుకోవడానికి వ్యవసాయం చేయడు.

రైతు అనేవాడు వ్యవసాయం ఆత్మగౌరవం కోసం చేస్తాడు. పది మందికి పట్టెడు అన్నం పెట్టడానికి రైతు వ్యవసాయం చేస్తాడు. గ్రామం లో తనను నమ్ముకున్న కుమ్మరి, కమ్మరి, వ డ్రంగి, చాకలి, మంగలి, యాదవ, ముదిరాజులు, మున్నూరుకాపు, దళితులు, గౌడ, గిరిజనులు, మైనార్టీలు.. కాపోల్లందరూ కలి సి బతకాలంటే వ్యవసాయం సాగాలని చేస్తా డు. వ్యవసాయం సాగాలని..

ఆలి మీది నుంచి తాళినికూడా తాకట్టుపెట్టి వ్యవసాయం చేస్తాడుకానీ.. లాభం కోసం కాదు. పిల్లను ఇచ్చేటప్పుడు మెడమీద ఎంత బంగారం ఉంది, బ్యాంకులో ఎన్ని కోట్లు ఉన్నాయనేది చూడరు. ఎన్ని ఎకరాలున్నాయి.. ఎంత వ్యవసాయం చేస్తాడనేది చూస్తారు. అంటే మనిషి యొక్క ఆత్మగౌరవం భూమిమీద ఆధారపడి ఉంది. ఊరుమీద ఆధారపడి ఉంది.

ఇయ్యాల ఊర్లల్ల ఉన్న భూములపై మీరు కన్నేసి కొల్లగొడుతుంటే.. రైతు కుటుంబం యావత్తూ రాత్రీపగలు కష్టపడి పంటలను పండించే భూములను అగ్గువకు బహుళజాతి కంపెనీలకు అమ్ముకుంటే.. రెండు మూడు ఏండ్లలో ఆ భూమికి యజమానులు ఆ కంపెనీలు అవుతాయి.. కానీ భూమిని నమ్ముకున్న రైతుల కాదు. ఇయ్యాల ఎవ్వడైనా.. మామూ లు.. ఎంత చేతగాని వాడైనా.. తన కన్నతల్లిపై ఎవడన్నా కన్నేసిండంటే.. పక్కనున్న గొడ్డలి అందుకుని అడ్డంగా నరుకుతడు.

అలాంటి కన్నతల్లి లాంటి ఈ భూమిమీద కన్నేసి.. పరోక్షంగా దేశంలోని కోట్లాది ఎకరాల భూ ములను కార్పొరేట్ కంపెనీలకు కొల్లగొట్టి పెట్టడానికి గుజరాత్ నుంచి బయలుదేరిన ఇద్దరు బేరగాళ్లు.. గుజరాత్ నుంచే వచ్చిన ఇద్దరు దళారులకు ఈ దేశాన్ని కట్టబెడుతున్నారు. బేరగాళ్ళంటే ఎవరో కాదు.. నరేంద్ర మోదీ, అమిత్‌షా.. దళారులంటే ఎవరో కా దు.. అంబానీ, అదానీ..

ఈ దుష్టచతుష్టయం కలిసి.. మన భూముల్లో యజమానులుగా ఆత్మగౌరవంతో కలిసి బతకాల్సిన మనల్ని.. మన భూముల్లో బానిసలుగా, మన రక్తాన్ని చెమటగా మార్చి పండించిన పంటలను ఆఠానాకు.. చారాణకు కొనుక్కుని మళ్ళీ శాశ్వతంగా తెల్లదొరల కాలంలో ఎలా బానిసలుగా బతికామో.. ఇయ్యాల మన భూముల్లో బానిసలుగా మార్చడానికే ఈ చట్టాలను తీసుకొచ్చారు..’ ఎన్నికలకు ముందు.. పలు సందర్భాల్లో అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఫార్మాసిటీ బాధిత రైతులకు ఇచ్చిన వాగ్దానం రద్దుచేస్తామని చెబుతున్నాం ‘ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి.

ప్రజల సొమ్ముతో, ప్రజలు కట్టే వడ్డీతో.. వచ్చే రాబడితో ఈ వ్యవస్థకు జీతాలిస్తున్నారు. అంతేగానీ.. కేసీఆర్ సొంత డబ్బుతో.. ఫాంహౌజ్ నుంచి వచ్చే ఆదాయంతో మీకు జీతాలివ్వడం లేదు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి. ఇటువంటి కేసీఆర్‌లను కాంగ్రెస్ పార్టీ అనేకమందిని చూసింది. ఆఫ్ట్రాల్ నువ్వెంత.. నీ లెక్కెంత. మేము గెలుస్తాం.. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత.. ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం జారీచేసిన జీవోను.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి.. రద్దుచేస్తామని చెబుతున్నాం.

కేవలం రెండు, రెండున్నర సంవత్సరాలు దీనిని అడ్డుకునేందుకు పోరాటం చేద్దాం.. రెండున్నర సంవత్సరాల తరువాత ఈ జీవోను క్యాన్సిల్ చేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడుతుంది.. అప్పుడు లీగల్‌గా ఈ జీవోను క్యాన్సిల్ చేసి.. మీ అందరికీ న్యాయంచేస్తామని వాగ్దానం చేస్తున్నాం..’ ఫార్మాసిటీ బాధిత రైతులతో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ