లక్ష్యం 90 లక్షల టన్నులు
- ధాన్యం సేకరణకు సర్కారు సన్నద్ధం
- సుమారు 17 కోట్ల గన్నీ బ్యాగులు సిద్ధం
రాష్ట్రవ్యాప్తంగా 8,251 కొనుగోలు కేంద్రాలు
ధాన్యం తరలించే వాహనాలకు జీపీఎస్
తొలుత నిజామాబాద్, నల్లగొండ, కామారెడ్డి జిల్లాల్లో..
ప్రతి సెంటర్‌లో టార్ఫాలిన్లు, ఆటోమేటిక్ ఫ్యాడీ డ్రైయర్లు, క్లీనర్లు, తేమ మీటర్లు ఉండేలా చర్యలు
నిత్యం మానిటరింగ్ చేయనున్న సివిల్ సప్లయ్ అధికారులు
హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): యాసంగి ధాన్యం కొనుగోలుకు సర్కార్ సన్నద్ధమవుతున్నది. ఇందుకు అన్ని ఏర్పాట్లుచేసింది. రైతు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ సీజన్‌లో 90 లక్ష ల టన్నుల ధాన్యం సేకరణకు సర్కారు సిద్ధమైంది. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా 8,251 కేం ద్రాలను ఏర్పాటు చేయబోతున్నది. ఇప్పటి కే అన్ని జిల్లాల కలెక్టర్లు, సివిల్ సప్లయ్ అధికారులకు ఆదేశాలు సైతం జారీచేసింది. తొ లుత నిజామాబాద్, నల్లగొండ, కామారెడ్డి జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు.
ఈ సీజన్‌లో 148 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అను గుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయబోతున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రక టించగా, వీటిలో ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలు ఉన్నాయి.
ధాన్యం కొనుగోలుకు సుమారు 17 కోట్ల గన్నీ బ్యాగులు సైతం సిద్ధం చేసిన ట్టు సమాచారం. కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం లోడ్‌తో వెళ్లే ప్రతి వాహనానికి జీపీఎస్ ఏర్పాటుచేయనున్నారు. ధాన్యం పక్క దారి పట్టకుండా, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు రాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. గత వానాకాలంలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 72 లక్షల టన్నుల ధా న్యాన్ని కొనుగోలు చేసి రికార్డు సృష్టించింది.
రికార్డుస్థాయిలో పంట దిగుబడి
రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. అయితే ప్రభుత్వం క్వింటాకు సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధర చెల్లిస్తున్నది. సన్నాలకు మద్దతు ధరతోపాటు అదనంగా రూ.500 బోనస్ కూడా చెల్లిస్తున్నది. దీంతో పంట దిగుబడి రికార్డుస్థాయిలో పెరిగిందని ప్రభుత్వం పేర్కొంటున్నది. ధాన్యం కాంటా వేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులను ప్రభుత్వం జమచేస్తున్నది.
ప్రతి కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్లు, ఆటోమెటిక్ ప్యాడీ డ్రైయర్లు, క్లీనర్లు, గ్రెయిన్ కాలిపర్లు, తేమ మీటర్లు, ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలు అందుబాటులో ఉంచుతున్నారు. అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడేందుకు పౌరసరఫరాలశాఖ వర్షం అంచనా వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నది. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తడవకుండా సెంటర్లవారీగా వెదర్ ఫోర్ కాస్ట్‌తో హెచ్చరికలు ఇవ్వనున్నది. ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేయనున్నారు.
చెక్ పోస్టులు, సరిహద్దుల్లో నిఘా
ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యం రవాణాను అరికట్టేందుకు సరిహద్దులో నిఘా పెంచనున్నారు. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 56 ఇంటర్ -స్టేట్ చెక్ పోస్టులను ఏర్పాటుచేస్తున్నారు. వానాకాలంలో సైతం చేపట్టినప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం వచ్చింది. అధికారులు సైతం పలు వాహనాలను పట్టుకున్నారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నారు.
చెక్ పోస్టుల్లో సీసీ కెమెరాలతో సర్వేలెన్స్ ఏర్పాటుచేసి, ఆకస్మిక తనిఖీలు చేస్తూ కట్టదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. అగ్రికల్చర్, మార్కెటింగ్, కోఆపరేటివ్, పోలీసు శాఖల సమన్వయంతో ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ధాన్యం రవాణాచేసే లారీలు, ఇతర వాహనాలకు జీపీఎస్ అమర్చబోతున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి నేరుగా కేటాయించిన మిల్లుకు వెళ్తున్నదా? లేదా ధాన్యం దారితప్పుతున్నదా? అనేది పర్యవేక్షణ చేయనున్నారు. ఎలాంటి అవకతవకలు జరుగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే లారీ యజమానులకు సైతం ఈ జీపీఎస్ కోసం వాహనాల వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులు సూచించినట్టు సమాచారం. నిఘా నడుమ ధాన్యం కొనుగోళ్లు చేపట్టనున్నారు.




