12 April, 2026 | 3:10 AM

తెలుగు రాష్ట్రాల్లో ‘రద్దు’ రగడ

12-04-2026 01:27 AM

గత ప్రభుత్వాల పాలసీలను పక్కన పెడుతున్న ప్రస్తుత ప్రభుత్వాలు

ఏపీలో రాజకీయాల కారణంగా ప్రాజెక్టులు రద్దు

తెలంగాణలోనూ అదే ధోరణి

ఇలాగైతే పెట్టుబడులు, అభివృద్ధికి ముప్పే!

హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి) : తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వాల నిర్ణయాలను రద్దు చేయడం లేదా నిలిపివేయడం సర్వసాధారణంగా మారిపోయింది. రోజురోజుకూ ఈ సంప్రదాయం మరింత బలపడుతున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. దీని ప్రభావం కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాష్ట్రాల ఆర్థిక స్థిరత్వంపై కూడా పడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చం ద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం విజయవాడ గవర్నర్‌పేటలోని ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాల ప్రైమ్ భూమిని లూలూ గ్రూప్ ఇంటర్నేషనల్ కంపెనీకి కేటాయించేందుకు ఇచ్చిన ప్రాథమిక అనుమతిని వెనక్కి తీసుకుంది. ఈ విషయాన్ని ఏప్రిల్ 8న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ప్రజా నిరసనలు, పారదర్శకతపై లేవనెత్తిన సందేహాలు, పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభు త్వం పేర్కొంది.

ఈ నిర్ణయం ఒక్కసారిగా తీసుకున్నట్టు కనిపించినా, గతంలో జరిగిన ఇలాంటి పరిణామాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 2019లో జరిగిన ఒక పరిణామం దీనికి ప్రతిబింబంగా నిలుస్తోంది. అప్పట్లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విశాఖపట్నంలో లూలూ మాల్‌కు కేటాయించిన 13.83 ఎకరాల భూమిని రద్దు చేసింది. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ కేటాయింపుతో రూ.2,200 కోట్ల ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన జరిగినప్పటికీ అనుమతిని రద్దు చేశారు. అనంతరం లూలూ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లో ఇక పెట్టుబడులు పెట్టబోమని ప్ర కటించడం, రాష్ట్ర పెట్టుబడి వాతావరణంపై ప్రతికూల సంకేతంగా మారింది. 

గతంలో పరిస్థితి వేరు 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ప్రభుత్వాలు మారినా అభివృద్ధి ప్రాజెక్టులు పెద్దగా ప్రభావితమవ్వలేదు. ఉదాహరణకు చంద్రబాబు ప్రారంభించిన హైటెక్ సిటీ ప్రాజెక్ట్‌ను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం కూడా కొనసాగించింది. కానీ 2014 విభజన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపో యాయి. రెండు కొత్త రాష్ట్రాల మధ్య ప్రాం తీయ పోటీలు, వ్యక్తి ఆధారిత రాజకీయ పార్టీలైన బీఆర్‌ఎస్, వైఎస్సాఆర్‌సీపీ బలపడటంతో పోటీ తీవ్రంగా మారింది.

ముఖ్యం గా బలమైన సంస్థాగత వ్యవస్థల లోపం ఈ సమస్యను మరింత పెంచింది. అన్ని పార్టీల మధ్య ఒప్పంద వ్యవస్థలు లేకపోవడం, చట్టబద్ధమైన బలమైన ఎంవోయూలు లేకపో వడం వల్ల ప్రభుత్వాలు ప్రాజెక్ట్ సమీక్షలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించే పరిస్థితి ఏర్పడింది.

ముందున్న మార్గం

ఈ పాలసీల రద్దు పరిణామం ఇలాగే కొ నసాగితే పోటీ సమాఖ్య వ్యవస్థ నష్టపోయే ప్రమాదం ఉంది. పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతారు, ఉపాధి అవకాశాలు తగ్గుతాయి, అభివృద్ధి మందగిస్తుంది. అయితే దీనికి ప్రధాన ప్రాజెక్టులపై అన్ని రాజకీయ పార్టీల మధ్య సమ్మతి సాధించడం, భారీ భూకేటాయింపులు, ప్రాజెక్టులపై స్వతంత్ర నిపుణుల కమిటీలు ఏర్పాటు, పెట్టుబడిదారుల ఒప్పందాలకు చట్టబద్ధ రక్షణ కల్పించే విధానాలు, కేంద్ర స్థాయి మార్గదర్శకాలు రూపొందించడం వంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి.

ప్రస్తుతం నారా చంద్రబాబు ప్రభుత్వం రం గాల వారీగా పెట్టుబడులను ఆకర్షించేందు కు తీసుకుంటున్న చర్యలు ఒక మంచి సం కేతం. కానీ ఇవి కేవలం ప్రకటనలకే పరిమి తం కాకుండా, సంస్థాగత సంస్కరణల రూప ంలో అమలులోకి రావాలి. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి రాజకీయాల మధ్య పోటీగా మా రుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.

తక్షణ రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలు, దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజ నాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. లూలూ ప్రాజెక్ట్ ఘటన మరోసారి అదే సందేశాన్ని ఇస్తోంది. పాలసీ స్థిరత్వం లేకపోతే, పెట్టుబడిదారుల నమ్మకం ఎలా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    పెట్టుబడిదారుల నమ్మకంపై ప్రభావం

    తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఆయా ప్రాజెక్టులను రద్దు చేయడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరుగుతోంది. ఒక ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని మరో ప్రభుత్వం రద్దు చేస్తే, దీర్ఘకాల పెట్టుబడులకు ఎవరు ముందుకు వస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. మాల్‌లు, విమానాశ్రయాలు, సాగునీటి ప్రాజెక్టులు, ఐటీ హబ్‌ల వంటివి దీర్ఘకాలికంగా లాభాలిచ్చే ప్రాజెక్టులు. కానీ పాలసీ మార్పులు పెట్టుబడిదారులకు ప్రమాద సంకేతాలుగా మారుతున్నాయి.

    2019లో లూలూ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ నుంచి వైదొలగడం ఒక స్పష్టమైన హెచ్చరికగా నిలిచింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా తగ్గుముఖం పట్టాయి. అక్టోబర్ 2019 నుంచి జూన్ 2025 వరకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఎఫ్‌డీఐ కేవలం 1.27 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఈ విషయంలో ఏపీ ఇతర దక్షిణాది రాష్ట్రాల కంటే చాలా వెనుకబడి ఉంది. ఇదే సమయంలో తెలంగాణ ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తూ ముందంజలో నిలిచింది.

    ఏపీలో ఉన్న అస్థిరతను తెలంగాణ కొంతవరకు అవకాశంగా మార్చుకుంది. అమరావతి నుంచి సింగపూర్ కన్సార్టియం వైదొలగడం, లూలూ గ్రూప్ నిర్ణయం రాష్ట్ర ప్రతిష్టపై తీవ్ర ప్రభావం చూపాయి. దేశీయ కంపెనీలు కూడా అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయి. నవయుగ వంటి సంస్థలు పలు ఒప్పందాలను కోల్పోయాయి. ఇలాంటి పాలసీ రద్దు నిర్ణయాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో సాధించిన పురోగతిని దెబ్బతీస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా పెట్టుబడులు గుజరాత్, తమిళనాడు వంటి స్థిరత్వం ఉన్న రాష్ట్రాలవైపు మళ్లే ప్రమాదం ఉంది. 

    ఏపీలో రివ్యూ రాజకీయాలు

    2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఈ ధోరణి మరింత స్పష్టంగా కనిపించింది. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గత టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలపై విస్తృత స్థాయిలో సమీక్ష చేపట్టింది. సుమారు రూ.2.5 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను రద్దు చేసింది. అమరావతి రాజధాని నిర్మాణం, సింగపూర్ కన్సార్టియంతో కుదిరిన స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్, పునర్వినియోగ విద్యుత్ ఒప్పందాలు, హైడల్ ప్రాజెక్టులు వంటివి అప్పుడు ప్రభావితమయ్యాయి.

    అలాగే నవయుగ ఇంజినీరింగ్‌తో కుదిరిన రూ.3,217 కోట్ల హైడల్ పవర్ ఒప్పందం కూడా నిలిచిపోయింది. అమరావతి విషయంలో తీసుకున్న నిర్ణయం అత్యంత వివాదాస్పదంగా మారింది. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణాన్ని నిలిపివేసి, మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకురావడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. రైతులు, పెట్టుబడిదారులు, నిపుణులు, అన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి.

    2024లో తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి ప్రాజెక్టుల పునరుద్ధరణపై దృష్టి పెట్టింది. అమరావతి నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించడం, పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేయడం వంటి చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ లూలూ ప్రాజెక్ట్ రద్దు నిర్ణయం క్యాన్సెల్ కల్చర్ ఇంకా కొనసాగుతోందనే అభిప్రాయాలను బలపరుస్తోంది.

    తెలంగాణలోనూ ఇదే ధోరణి... 

    తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా ఇలాంటి విమర్శలను ఎదుర్కొంటోంది. బీఆర్‌ఎస్ పార్టీ నేతలు తమ హయాంలో ప్రారంభమైన పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిలిచిపోయాయని ఆరోపిస్తున్నారు. రెండేళ్ల పాలనలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కాలేదని కూడా విమర్శిస్తున్నారు.

    లింక్ రోడ్ల టెండర్లు రద్దు చేయడం, సిద్దిపేటలో రూ.1,070 కోట్ల పర్యాటక ప్రాజెక్టులు నిలిపివేయడం, స్టేడియాలు, వ్యవసాయ కళాశాలల పనులు ఆలస్యం కావడం వంటి అంశాలను వారు ప్రస్తావిస్తున్నారు. మెట్రో రైలు విస్తరణ, మూసీ నది పునరుజ్జీవం, ఫార్మా సిటీ (భారత్ ఫ్యూచర్ సిటీగా రీబ్రాండ్) వంటి ప్రాజెక్టులు కూడా విధాన మార్పులు, నిరసనల కారణంగా ఆలస్యమవుతున్నాయి. కాంగ్రెస్ మాత్రం గత ప్రభుత్వం ఆయా ప్రాజెక్టులను అసంపూర్ణంగా వదిలేసిందని వివరిస్తుంది.