12 April, 2026 | 2:48 AM

చెప్పు తెగుద్ది!

12-04-2026 01:19 AM

తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు 

ములుగు (మహబూబాబాద్) ఏప్రిల్ 11 (విజయక్రాంతి): అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్ల పంపిణీలో తాను అవినీతి, అవకతవకలకు పాల్పడినట్లు బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న నిందారోపణలపై రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు.

తప్పుడు ఆరోపణలు చేస్తే, చెప్పు తెగుద్ది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం ములుగు జిల్లా కాంగ్రెస్ కమిటీ పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో  మంత్రి మాట్లాడుతూ, కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక్కో ఫోన్ 11,650 రూపాయలకు, థర్డ్ పార్టీ ద్వారా ఓపెన్ టెండర్ విధానంలో కొనుగోలు చేశామని..

ఇందు లో ఎక్కడకూడా ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా కొనుగోలు చేశామని, అయితే తాము 14,500 రూపాయల చొప్పున ఖరీదు చేసినట్లు కట్టుకథలతో వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేసి నిరాధార ఆరోపణలు చేస్తున్నట్లు మంత్రి మండిపడ్డారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి.. ప్రాణాలకు సైతం తెగించి ప్రజలకోసం పాటుపడుతున్న తనపై లేనిపోని నిందారోపణలు వేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.

తన రాజకీయ జీవితంలో ఏనాడు కూడా అవకతవకలకు పాల్పడలేదని, ఉద్యమ సమ యం నుంచి మొదలుకొని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకోసం పనిచేస్తున్న ట్లు చెప్పారు. అధికారంలో లేనప్పుడు ఎన్నో బెదిరింపులు వచ్చాయని, ఆఫర్లతో ప్రలోభ పెట్టేందుకు కూడా ప్రయత్నించినా తాను ఏనాడు  నమ్మిన సిద్ధాంతాన్ని వదిలిపెట్టలేదన్నారు. ప్రజలకు మంచి చేస్తే ఓర్వలేని బీఆర్‌ఎస్ తనపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని మంత్రి స్పష్టంచేశారు. 

ఇంటి పంచాయితీ తీర్చలేక.. 

మా నాయన, అన్న, బావ కలిసి దోచుకున్నారని కవిత బాహాటంగా చేస్తున్న విమర్శ లకు సమాధానం చెప్పలేక, ఇంటి పంచాయితీని తీర్చుకోలేని పరిస్థితిలో బీఆర్‌ఎస్ నేత లు ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కుర్చీ కోసమే కొట్లాడుకుంటున్న బీఆర్‌ఎస్ నేతలకు ఇక ప్రజల సంక్షేమం, అభివృద్ధి చేయడం సాధ్యం కాద ని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలిచి మళ్లీ తమదే అధికారంలోకి వస్తామని అన్నారు.