గురునానక్ వర్సిటీని సందర్శించిన అమెరికా విద్యావేత్త సన్నీరెడ్డి
ఇబ్రహీంపట్నం (విజయ క్రాంతి): ఇబ్రహీంపట్నంలోని గురు నానక్ విద్యాసంస్థల యూనివర్సిటీని అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, వేన్నే స్టేట్ యూనివర్సిటీ గవర్నర్ బోర్డు సభ్యుడు సన్నీ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు, ప్రపంచ నాయకత్వం, సాంకేతిక ఆవిష్కరణలపై విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు.
నిరంతరం కొత్త ఆలోచనలతో, నాయకత్వ లక్షణాలతో ప్రపంచ స్థాయి పోటీలో రాణించాలని ఆయన సూచించారు.అనంతరం సన్నీ రెడ్డిని గురు నానక్ వర్సిటీ ఛాన్సలర్ సర్దార్ గగన్దీప్ సింగ్ కోహ్లీ, వైస్ ఛాన్సలర్ డా. హెచ్.ఎస్. సైనీ ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వర్సిటీ రెక్టర్ డా. కలైరాసన్, రిజిస్ట్రార్ డా. విశాల్ వాలియా, డైరెక్టర్లు డా. పార్థసారథి, డా. హరీష్ కుంద్రా, హెచ్‌ఓడీ డా. రోజ్ మేరీ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇలాంటి అంతర్జాతీయ ప్రముఖుల సందర్శనలు విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్గా తీర్చిదిద్దడానికి దోహదపడతాయని యాజమాన్యం పేర్కొంది.






