calender_icon.png 22 May, 2025 | 3:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికా రక్షణ కవచం ‘గోల్డెన్ డోమ్’

22-05-2025 01:38:38 AM

  1. వివరాలు వెల్లడించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

ప్రాజెక్టు విలువ 175 బిలియన్ డాలర్లు

రష్యా, చైనా మిస్సైల్ దాడులు ఎదుర్కోవడమే లక్ష్యం

న్యూయార్క్, మే 21: అమెరికాను మిస్సైల్ దాడుల నుంచి రక్షించడానికి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మారుతున్న యుద్ధ తంత్రానికి అనుకూలంగా అమెరికా అత్యాధునిక గగనతలాన్ని మరింత పటిష్టం చేసేందుకు రక్షణ కవచం ‘గోల్డెన్ డోమ్’ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. దీనిలో భాగంగా ట్రంప్ మంగళవారం ‘గోల్డెన్ డోమ్’ ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు.

ఈ ‘గోల్డెన్ డోమ్’ వ్యవస్థను మూడు సంవత్స రాల్లో అమల్లోకి తీసుకురానున్నట్టు తెలిపా రు. దీని కోసం మొదటి దశలో 25 బిలియన్ డాలర్ల నిధులతో పాటు మొత్తం 175 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో అమెరికా ప్రజలకు కట్టుదిట్టమైన మిస్సైల్ రక్షణ వ్యవస్థను నిర్మిస్తానని హామీ ఇచ్చినట్టు ట్రంప్ మరోసారి గుర్తుచేశారు.

‘గోల్డెన్ డోమ్’ వ్యవస్థ క్రూయిజ్, బాలిస్టిక్, హైపర్సోనిక్ మిస్సైల్స్, డ్రోన్ల నుంచి దేశాన్ని రక్షించేందుకు ఉపయోగపడనుంది. గోల్డెన్ డోమ్ నిర్మాణం తర్వాత ప్రపంచంలోని ఇతర వైపుల నుంచి లేదా అంతరిక్షం నుంచి ప్రయోగించిన మిస్సైల్స్‌ను అడ్డుకోవడానికి సామర్థ్యం కలిగి ఉంటుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.

ఇది దేశం విజయానికి, జీవనానికి చాలా ముఖ్యమైనదన్నారు. కాగా ఈ ప్రాజెక్టుకు అమెరికా స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గ్యుట్లెయిన్ నేతృత్వం వహిస్తారని పేర్కొన్నారు. 

ఎలా పనిచేయనుంది?

గోల్డెన్ డోమ్ వ్యవస్థ భూమి, అంతరిక్షం నుంచి అమెరికా గగనతలంపై కన్నేసి ఉంచనుంది. తమ దేశం వైపు వచ్చే క్షిపణులు, ఇతర ముప్పులను ముందుగానే పసిగడుతుంది. చాలా వరకు అవి టేకాఫ్ అవ్వక ముందే లేదా మార్గమధ్యలోనే వాటిని ధ్వంసం చేసే సత్తా ఉంటుంది. ఈ వ్యవస్థలో అంతరిక్షం నుంచి ప్రయోగించే ఇంటర్‌సెప్టర్ల నెట్‌వర్క్ కీలకంగా మారనుంది.

ముఖ్యంగా చైనా, రష్యా , ఇరాన్, ఉత్తర కొరియా నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడం కోసం దీనిని సిద్ధం చేస్తున్నారు. అయితే చైనా, రష్యా ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించాయి. అంతరిక్షాన్ని యుద్ధ క్షేత్రంగా మార్చేస్తుందని ఆయా దేశాలు ఆరోపించాయి.

ఇటీవల హమాస్ ప్రయోగించిన వేలాది రాకెట్ల నుంచి ఇజ్రాయెల్ ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన వ్యవస్థ ‘ఐరన్ డోమ్’ గుర్తుంది కదా.. దానికి మించి అత్యాధునిక రక్షణ కవచాన్ని ‘గోల్డెన్ డోమ్’ పేరుతో అమెరికా రూపొందించనుంది.