12-09-2025 09:34:28 AM
పలు లోతట్టు ప్రాంతాలు జలమయం
కూలిన ఇండ్లు, నీట మునిగిన జూట్ బ్యాగుల పరిశ్రమ
నిండిన చెరువులు కుంటలు.
హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్(Huzurabad) డివిజన్ తోపాటు పట్టణంలో గురువారం రాత్రి కురిసిన వర్షం హుజురాబాద్ ను ముంచెత్తింది. రహదారులు వాగుల్లా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాలలో జలమయమయ్యాయి. ఇళ్ళలోకి నీరు చేరి రాత్రి నిస్సహాయ స్థితిలో కాలనీ వాసులకు కంటిమీద కునుకు లేకుండా గడిపారు.
మామిళ్లవాడ, కిందివాడ, బుడగ జంగాల కాలనీ, పోచమ్మ వాడ, గాంధీనగర్, మారుతి నగర్, గ్యాస్ గోదాం ఏరియాలో డ్రైనేజీలు సిస్టం సరిగా లేకపోవడంతో మొత్తం వరద నీరు ఇండ్లలోకి చేరింది. ఇండ్లలో మోకాళ్ల లోతు నీళ్లలో నానా అవస్థలు పడ్డారు. గ్యాస్ గోదాం ఏరియాలో వేల్పుల శారదకు చెందిన జూట్ బ్యాగ్ ఇండస్ట్రీ నీట మునిగింది. రెండున్నర టన్నుల జూట్ బ్యాగులు నీటి పాలైయి సుమారు మూడు లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు నిర్వాహకురాలు శారద ఆవేదం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటుంది.
బుడగ జంగం కాలనీలో నేలమట్టమైన గుడిసె
బుడజంగం కాలనీలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గుడిసె నేలమట్టమయింది. ప్రభుత్వం పునరవాసం కల్పించి మా కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
పొంగిపొర్లుతున్న చిలక వాగు.. రాకపోకలకు అంతరాయం
పట్టణంలోని చిలుక వాగు(Chiluka Vagu) పొంగిపొర్లుతుంది. చిలక వాగు పైవంతెన లేకపోవడంతో కనుకలగిద్ద, జూపాక గ్రామాల నుండి వచ్చే వాహనదారులు, నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికి ఎన్నిసార్లు అధికార్లకు మొరపెట్టిన వంతెన నిర్మించడం లేదని వాపోతున్నారు. పట్టణ శివారులో నివాసం ఉండే వడ్డెర కాలనీ వాసులు ఏ అవసరానికైనా వాగు దాటి హుజురాబాద్ కు రావాలి వాగు ప్రవాహం ఎక్కువ కావడంతో వాగు దాటనివ్వకపోవడంతో నిత్యవసర సరుకులు తీసుకురావడానికి ఇబ్బంది ఏర్పడుతుందని కాలనీవాసులు మొరపెట్టుకుంటున్నారు.
సహాయక చర్యల్లో కమిషనర్
తెల్లవారుజామున 4 గంటల నుండి హుజురాబాద్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య లోతట్టు ప్రాంతాలలో పర్యటించి డ్రైనేజీలలో పేర్కొన్న చెత్తను సిబ్బందితో తొలగించి ఇండ్లలోకి చేరిన నీటిని బయటకు ఎత్తిపోశారు.