22-05-2025 01:37:38 AM
- ప్రకటించిన ఆ రాష్ట్ర సీఎం లాల్ దుహేమా
- ఈ ఘనత సాధించిన తొలి రాష్ట్రంగా గుర్తింపు
న్యూఢిల్లీ, మే 21: దేశంలో పూర్తి అక్షరాస్యత సాధించిన తొలిరాష్ట్రంగా మిజోరం నిలిచింది. 2011లో 91.33 శాతం అక్షరాస్యతతో దేశంలో 3వస్థానంలో ఉన్న ఆ రాష్ట్రం.. ఇప్పుడు దాన్ని అధిగమించింది. ప్రస్తుతం ఆ రాష్ట్ర అక్షరాస్యతారేటు 98.2 శాతంగా ఉన్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లాల్ దుహోమా వెల్లడించారు.
మిజోరం యూనివర్సిటీలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి జయంత్ చౌదరి సమక్షంలో దుహేమా ఈ విషయాన్ని ప్రకటించారు. అక్షరాస్యతా రేటును మరింత మెరుగుపరుస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం తమ సమష్టి కృషి, అంకితభావానికి ఫలితమని తెలిపారు. ఈ విజయం మిజోరం ప్రయాణంలో ఒక చారిత్మ్రాక ఘట్టమని అభివర్ణించారు. కాగా ఏ రాష్ట్రమైనా 95 శాతం మార్కును దాటితే సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా ప్రకటిస్తారు. మిజోరం 1987, ఫిబ్రవరి 20న భారతదేశంలో 23వ రాష్ట్రంగా అవతరించింది. దీని భౌగోళిక విస్తీర్ణం 21,081 చదరపు కిలోమీటర్లుగా ఉంది.