28 August, 2026 | 6:56 AM

భారతీయ సంస్కృతికి రక్ష

28-08-2026 12:00 AM

నేడు రాఖీ పౌర్ణమి :

భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగ వెనుక ఒక గొప్ప జీవన సం దేశం ఇమిడి ఉంటుంది. ఆచారాలు, సంప్రదాయాలను ఇవి ప్రతిబింబిస్తాయి. మనిషి జీవితాన్ని విలువలు.. బాధ్యతలు.. మానవీయతతో అను సంధానించే పవిత్ర సందర్భాలు మన పండుగలు. అలాంటి మహోన్నతమైన పర్వదినాల్లో రక్షాబంధన్ ఒకటి. శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకొనే ఈ పర్వదినం అన్నాచెల్లెళ్లు.. అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, విశ్వా సం, పరస్పర రక్షణకు ప్రతీకగా నిలుస్తుంది.

అందుకే దీనిని రాఖీ పౌర్ణమి, నూలుపౌర్ణమి అని కూడా పిలుస్తారు. రాఖీ అనేది కేవలం చేతికి కట్టే ఒక నూలుదారం కాదు. దాని వెనుక ప్రేమ, ఆత్మీయత పెనవేసుకొని ఉన్న పవిత్ర బంధం దాగి ఉంది. సోదరి తన సోదరుడి మణికట్టుకు రాఖీ కడు తూ అతని క్షేమాన్ని కోరుతుంది. సోదరుడు తన సోదరిని జీవితాంతం గౌరవిస్తూ.. అవసరమైనప్పుడు అండగా నిలబడతాననే భావాన్ని వ్యక్తం చేస్తాడు. ఈ చిన్న నూలుదారం రెండు మనసులను మాత్రమే కాదు, రెండు కుటుంబాలను, తరతరాల అనుబంధాలను కలుపుతుంది.

‘రక్ష’ అంటే కాపాడటం.. బంధన్’ అంటే బం ధం. అంటే రక్షాబంధన్ అనేది రక్షణతో కూడిన పవిత్ర బంధం. అయి తే ఈ రక్షణ భావనను అన్నాచెల్లెళ్ల సంబంధానికే పరిమితం చేయకూడదు. నేటి సమాజంలో ప్రతి ఒక్క రూ మరొకరికి అండగా నిలబడాలి. స్త్రీలకు గౌరవం, భద్రత కల్పించాలి. దేశాన్ని ప్రేమించాలి. సమాజ శ్రేయస్సు కోసం మన వంతు బాధ్యతను నిర్వర్తించాలి. ఈ విస్తృతమైన అర్థంలో చూసినప్పుడు రక్షాబంధన్ ఒక కుటుంబ పండుగ మాత్రమే కాదు..

సామాజిక బాధ్యతను గుర్తుచేసే స్ఫూర్తిదాయకమైన పర్వదినం. భారతీయ సంప్రదాయంలో రక్షాబంధనానికి అనేక చారిత్రక, పౌరాణిక, సాంస్కృతిక నేపథ్యాలు ఉన్నాయి. శ్రీకృ ష్ణుడు- ద్రౌపది, ఇంద్రుడు- ఇంద్రాణి వంటి కథనాలు రక్షా భావనకు ప్రతీకలుగా తరతరాలుగా నిలుస్తున్నాయి. ఈ కథనాలన్నింటి అంతరార్థం ఒక్కటే.. ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలబడటం, బంధాన్ని బాధ్యతగా స్వీకరించడం. రక్షాబంధన్ మన కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని కూడా గుర్తుచేస్తుంది.

ఆధునిక జీవనశైలిలో ఒకే ఇంట్లో పుట్టి పెరిగిన అన్నాచెల్లెళ్లు కూడా సంవత్సరాల తరబడి కలుసుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాంటి సమయంలో రాఖీ పౌర్ణమి మన బంధాలను మరోసారి గుర్తుచేసే పవిత్రమైన అవకాశాన్ని కల్పిస్తుంది. నూలు పౌర్ణమి అనే పేరులోనూ ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక భావం ఉంది. పవిత్రమైన నూలును రక్షా సంకల్పానికి ప్రతీకగా భావించడం మన సంప్రదాయంలో ఎంతో పురాతనమైనది.

ఆ నూలు శరీరానికి మాత్రమే కాదు.. మనసుకు కూడా ఒక బాధ్యతను గుర్తుచేస్తుంది. ఈ సందర్భంగా మనం రాఖీ అర్థాన్ని మరింత విస్తృతంగా స్వీకరించాలి. ప్రతి సోదరి భద్రంగా ఉండే సమాజాన్ని నిర్మించడం, ప్రతి మహిళను గౌరవించడం, ప్రతి బాలికకు విద్య స్వేచ్ఛ భద్ర త కల్పించడం, కుటుంబాల్లో పరస్పర గౌరవాన్ని పెంపొందించడం మనందరి బాధ్యత. బంధం అనేది హక్కు మాత్రమే కాదు.. బాధ్యత కూడా. ఇదే రక్షాబంధన్ అందించే మరో గొప్ప సందేశం.

దేశం మనకు ఇచ్చిన స్వేచ్ఛను గౌరవిస్తూ, దేశం కోసం మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి ఇంట్లో ప్రేమ, ప్రతి కు టుంబంలో ఐక్యత, ప్రతి హృదయంలో మానవీయత, ప్రతి సమా జంలో పరస్పర గౌరవం వెల్లివిరియా లి. రాఖీ నూలుదారం మన చేతికి మాత్రమే కాకుండా మన హృదయానికీ కట్టాలి. అది మన బాధ్యత ను, సంస్కృతిని, కుటుంబ విలువలను, సామాజిక కర్తవ్యాన్ని ఎప్పటి కప్పుడు గుర్తుచేస్తూ ఉండాలి.

పగుడాకుల బాలస్వామి

 వ్యాసకర్త: ధర్మాచార్య సంపర్క ప్రముక్,

వీహెచ్‌పీ, తెలంగాణ, 9912975753