నేపాల్ విషాదం!

28-08-2026 | 12:00am

నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం, గల్లంతు కావడం, వేలాది మంది నిరాశ్రయులుగా మారడం కలచివేస్తున్నది. మృతులు, గల్లంతైన వారిలో భారతీయులు కూడా ఉండటం మరింత విషాదకరం. అయితే, విపత్తు సంభవించిన వెంటనే నేపాల్ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయడం, సహాయక చర్యలను ముమ్మరం చేయడంతో కొంతమే రకు ప్రాణనష్టం తప్పిందని చెప్పవచ్చు.

దేవభూమిగా పిలుచుకునే నేపాల్‌లో సంభవించిన ఈ వరదలకు ప్రకృతి వైపరీత్యమే కారణమని తెలుస్తున్నది. భోటెకోసి నదీ ప్రవాహానికి విరిగిపడిన మంచుకొండలు, కొండచరియలు, అడ్డుపడటంతో తాత్కాలిక ఆనకట్ట ఏర్పడి నీళ్లు నిలిచిపోయాయని,  అనంతరం ఆ అడ్డంకి తొలగిపోవడంతో ఆ నీళ్లు ఒక్కసారిగా దిగువకు ప్రవహించి వరదలకు కారణమై ఉండవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

హిమాలయ ప్రాంతాల్లో నదీ ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడితే ఎంతటి ప్రళయం సంభవిస్తుందో ఈ ఘటన కళ్లకు కట్టింది. ఈ ఉదంతం హిమాలయ ప్రాంతాల్లో ప్రకృతి పరిరక్షణపై చర్చకు దారితీసింది. కాగా, నేపాల్‌తో పాటు ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలు అత్యంత సున్నితమైన పర్యావరణ వ్యవస్థలకు నిలయాలు. సహజసిద్ధమైన అడవులు, కొండలు, గుట్టలు, నదులు, హిమనీనదాలకు ఈ ప్రాంతాలు నెలవు.

ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో దృఢమైన శిలలతో కాకుండా మట్టి, ఇతర వదులైన పదార్థాలతో ఏర్పడిన కొండలు, గుట్టలు ఉంటాయి. అందువల్ల ఉత్తర భారత్‌లో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మికంగా వరదలు సంభవించడాన్ని మనం తరచూ చూస్తుంటాం. అయినప్పటికీ అభివృద్ధి, పర్యాటకం పేరిట సున్నితమైన ఈ ప్రాంతాల్లో విచ్చలవిడిగా నిర్మాణాలు చేపట్టడం ఆందోళనకరం.

కొండలను తొలచి రహదారులు నిర్మించడం, నదీ తీరాల్లో భారీ భవన నిర్మాణాలు చేపట్టడం వల్ల నదుల సహజ ప్రవాహ మార్గాలు నానాటికీ కుంచించుకుపోతున్నాయి. తత్ఫలితంగా వరదల సమయంలో నదులు కొత్త మార్గాన్ని అన్వేషిస్తూ, జనావాసాలను ముంచెత్తుతున్నాయి.

మానవ తప్పిదాలకు తోడు ప్రపంచవ్యా ప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా హిమాలయాల్లోని మంచుకొండలు వేగంగా కరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రకృతితో సహజీవనం చేస్తేనే, మానవ మనుగడ సాగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో నేపాల్ విషాదం నుంచి భారత్‌తో పాటు అన్ని హిమాలయ దేశాలు పాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు