8 July, 2026 | 6:44 AM

నక్సలైట్ పెరుమాళ్ భావోద్వేగ కథ

19-12-2024 12:00 AM

విజయ్‌సేతుపతి, వెట్రీమారన్ కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘విడుదల-2’. డిసెంబర్ 20న విడుదల కానుందీ సినిమా. శ్రీ వేదాక్షర మూవీస్ సంస్థకు చెందిన చింతపల్లి రామారావు తెలుగు హక్కులను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం చిత్ర విశేషాలను విలేకరులతో పంచుకున్నారు. “ఓ విప్లవ కెరటం అణగారిన వర్గాలను పెట్టుబడిదారి వ్యవస్థ నుంచి ఎలా బయటపడేశాడు అనేది ఈ సినిమాలో ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. మనతో మిళితమైన అంశాలతో కూడిన కథ.

తెలుగు రాష్ట్రాల్లోని సమస్యలు, ఇక్కడ జరిగిన సంఘటనల ఆధారంగా తమిళ దర్శకుడు తెరకెక్కించిన తెలుగు కథ. ప్రజాసంక్షేమం కోసం ఓ వ్యక్తి కుటుంబాన్ని కూడా వదిలి ఎలాంటి త్యాగాలు చేశాడు? అనేది ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది. పెరుమాళ్ పాత్రకు విజయ్ సేతుపతి నూటికి నూరు శాతం సరిపోయాడు. నక్సలైట్‌గా నటన, పాత్రలోని ఎమో షన్ పండించిన విధానం అద్భుతం.

ఇళయరాజా నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రాణం.  ‘విడుదల’ కథ అంతా ఈ రెండో భాగంలోనే ఉంటుంది. పార్ట్ వన్‌కు పదిరెట్టు అద్భుతంగా ఈ సినిమా ఉంటుంది. ఇకపోతే ఇంకా మేం నిర్మిస్తున్న ‘శ్రీ శ్రీ రాజావారు’ చిత్రం విడుదలకు ఉంది. త్వరలో ‘డ్రీమ్‌గర్ల్’ అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతున్నాం. మరో రెండు సినిమాలూ సెట్స్ మీదకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి” అన్నారు.