20 May, 2026 | 8:32 PM

ఆగని మూగరోదన

19-06-2024 01:06 AM
  • పట్టించుకోని పోలీసులు, అధికారులు

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్18 (విజయక్రాంతి): పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా పశువుల అక్రమ రవాణా ఆగడం లేదు. అనుమతులు లేకున్నా మూగజీవాలను దళారులు కబేళాలకు తరలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో పశువులను కుక్కి, తాళ్లతో కట్టి మహారాష్ట్ర నుంచి ఆసిఫాబాద్ మీదుగా అక్రమ రవాణా చేస్తున్నారు. జిల్లాలోని జైనూర్, వాంకిడి, కౌటాల మండలాల్లో మాత్రమే పశువుల సంతలు జరుగుతున్నాయి. ఈ సంతల్లో రైతులు, పశుపోషకులు మాత్రమే అవసరాల నిమిత్తం ఆవులు, గేదెలు, ఎద్దులు, దూడల క్రయవిక్రయాలు జరపాలి. వారికి బదులు వ్యాపారులు, దళారులు పశువుల క్రయవిక్రయాలను జరుపుతున్నారు.

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాలు జిల్లాకు ఆనుకుని ఉండటంతో ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు తరలించే పశువులకు కౌటాల మండ లంలోని వారసంత ద్వారా అక్రమంగా అనుమతులు తీసుకుంటున్నారు. కొన్నింటికి అనుమతులు తీసుకుని, పదుల సంఖ్యలో పశువులను తరలిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు సిర్పూర్(టి) మీదుగా అక్రమంగా పశువులను తరలిస్తున్నారు. కంటెయినర్, లారీల్లో ఒక్కో దాంట్లో 20 వరకు మూగజీవాలను కుక్కి తరలిస్తున్నారు. అధికారులు తూతూమంత్రంగానే దాడులు నిర్వహించి, వదిలేస్తున్నారు.  

దళారుల భారీ నెట్‌వర్క్

పశువుల అక్రమ రవాణాకు దళారులు భారీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు. వాంకిడి, జైనూర్, కౌటాల మండలాలతో పాటు మహారాష్ట్ర నుంచి పశువులను కొనుగోలు చేసి రాత్రి వేళల్లో గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. సిర్పూర్ (టి) నుంచి కాగజ్‌నగర్ వరకు, రెబ్బెన నుంచి మంచిర్యాల దాటే వరకు ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని దందా కొససాగిస్తున్నారు. పోలీసుల తనిఖీల గురించి ఏజెంట్లు దళారులకు సమాచా రం అందిస్తుంటారు. అధికారులు అడ్డు తగలకుండా ముందే ముడు పులిచ్చి సర్దుబాటు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.  

నిబంధనలను తుంగలో తొక్కి..

పశువుల రవాణా, క్రయవిక్రయాలపై కేంద్రం పలు నిబంధనలు విధించింది. సంతల్లో విక్రయానికి ఎన్ని పశువులు, ఎక్కడెక్కడి నుంచి వచ్చాయన్న విషయాలను రికార్డుల్లో రాయాలి. ఆరోగ్యంగా ఉన్న పశువులను పశు వైద్యాధికారులు పరీక్షించి వాటి విక్రయాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలి. వ్యవసాయానికి మాత్రమే వినియోగించుకునేలా ధ్రువీ కరణ పత్రం తీసుకోవాలి. ఆవులు, లేగ దూడలను విక్రయించొద్దు. ఎక్కడా నిబంధనలు అమలు కావడం లేదు.  

తనిఖీల్లో పట్టుబడ్డ వాహనాలు

ఈ నెల 13న సిర్పూర్(టి), కౌటాల పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా పశువులను తరలిస్తున్న ౨ వాహనాలు పట్టుబడ్డాయి. అందులో ఉన్న ఆవులకు వైద్య పరీక్షలు నిర్వహించి కాగజ్‌నగర్‌లోని గోశాలకు తరలించారు. ఈ ప్రాంతం గుం డా తప్పించుకెళ్లిన మరో రెండు వాహనాలు మందమరి, బసంత్‌నగర్ పోలీసుల కు పట్టబడినట్లు సమాచారం. ఈ ఏడాది అక్రమంగా పశువుల రవాణాపై నాలుగు కేసులు నమోదయ్యాయి. రెండు వ్యాన్లను పోలీసులు సీజ్ చేసి, మొత్తం 39 మూగజీవాలను రక్షించి గోశాలలకు తరలించారు.

అడ్డుకట్ట వేయాల్సిందే

జిల్లా మీదుగా నిత్యం గుట్టుచప్పుడు కాకుండా పశువుల అక్రమ రవాణా జరుగుతున్నా రవాణాశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. పక్క రాష్ట్రం నుంచి వచ్చే ప్రతీ వాహనాన్ని సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీ చేసిన తర్వాతే రాష్ట్రంలోకి అనుమతించాలి. కానీ పశువులు తరలిస్తున్న వాహనాలు సరిహద్దు దాటి రాష్ట్రంలోకి ప్రవేశించడంమే కాకుండా హైదరాబాద్ వరకు వెళ్లడం గమనార్హం. పశువుల అక్రమ రవాణ విషయం రవాణ శాఖ అధికారులకు తెలిసే జరుగుతున్నదన్న అనుమానాలు కలుగుతున్నాయి. 

పశువుల అక్రమ రవాణాపై నిఘా

పశువుల అక్రమ రవాణను అరికట్టేందుకు ప్రత్యేకం నిఘా పెట్టాము. ఇప్పటికే మహారాష్ట్ర, చత్తిస్‌ఘడ్ సరిహద్దు మండలాలతో పాటు వాంకిడి, సిర్పూర్(టి), కౌటాల, చింతలమానేపల్లి, పెంచికల్‌పేట మండ లాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మూగజీవాలను అక్రమంగా తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రవాణ జరుగుతున్నట్లు తెలిస్తే ప్రజలు తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నాం. 

 సురేష్ కుమార్, ఎస్పీ, ఆసిఫాబాద్