11-11-2025 01:50:02 AM
-‘అరుణోదయ’ తరఫున నివాళి
-రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు విమలక్క
హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): అందెశ్రీ మరణించారన్న వార్త తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు విమలక్క, రాష్ట్ర అధ్యక్షుడు మల్సూర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతుల రమేష్ అన్నారు. ప్రజలను, చుట్టూ ఉన్న ప్రకృతిని పాఠశాలగా భావించి ఆయన నేర్చుకున్న పాటల విద్య తెలంగాణ గీతమై మన హృదయాల్లో మాయం కాలేని గుర్తుగా నిలిచిపోయిందని పేర్కొన్నారు.
తెలంగాణ ఉన్నంతవరకు అందెశ్రీ గీతం ఉంటుందని, అందెశ్రీ ప్రజల కవి, ప్రకృతి కవి, తెలుగు నేల గర్వించే విశ్వ కవి కూడా అన్నారు. ‘రాష్ట్ర సాధనోద్యమంలో అందెశ్రీతో ఎన్నో వేదికలు మేము పంచుకున్నాము. తెలంగాణ రాష్ట్రమున్నంత వరకు ప్రజల హృదయాల్లో జయ జయహే తెలంగాణ, జననీ జయకేతనం అనే తెలంగాణ రాష్ట్ర గీతంలో అందెశ్రీ సజీవంగా ఉంటారు. చిన్నతనం నుండి కష్టాలు, కన్నీళ్లు మూటగట్టుకుని, ఎంతోమంది తెలంగాణ జానపద వైతాళికుల సాంగత్యంలో గొప్ప పాండిత్యాన్ని అలవరచుకున్నాడు.
అందెశ్రీకి మా సమాఖ్య హృదయపూర్వక ఉద్యమ నివాళులర్పిస్తుంది’ అన్నారు. ‘తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పాటలన్నింటినీ గ్రంధస్తం చేయడంలో ఆయన సంపాదక బాధ్యతలు తీసుకున్న నిప్పుల వాగు నిరంతరం పారుతూ పచ్చని పంటల కోసం సాహిత్య సేద్యం చేయడమే కాకుండా, మారుమూల చీకటి పల్లెల్లోకి వెలుగులు విరజిమ్మాలని ఆశిస్తున్నాం’ అన్నారు.