11-11-2025 01:35:41 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 10 (విజయక్రాంతి): రాష్ర్టవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఉప ఎన్నికకు ఏర్పాట్లు అన్ని పూర్తయినట్టు సీఈవో సుదర్శన్‌రెడ్డి తెలిపారు. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, వాటిలో 68 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద సీఆర్‌పీతో భద్రత చేశామని తెలిపారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి పర్యవేక్షణ ఉంటుందని, మొదటిసారి అన్ని పోలింగ్ స్టేషన్లలో డ్రోన్‌లను వినియోగిస్తున్నామని సీఈవో చెప్పారు.
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని ఆయన తెలిపారు. జీపీఎస్ అమర్చిన వాహనాలను ఉపయోగించి ఈవీఎంల రవాణాను కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ డీఆర్‌సీ కేంద్రం నుంచి ఆదివారం ఉదయం నుంచే పోలింగ్ సిబ్బంది ఈవీఎంలు, ఇతర సామాగ్రితో నియోజకవర్గంలోని 139 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 407 పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు.
ఈవీఎంల పంపిణీ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ స్వయంగా పర్యవేక్షించి, సిబ్బందికి పలు సూచనలు చేశా రు. పోలింగ్ కేంద్రాల బయట గుంపులుగా ఉండటం, ఓటర్లను ప్రలోభపె ట్టడం వంటి అక్రమాలను అరికట్టేందుకు 139 డ్రోన్లను సిద్ధం చేశారు. డీఆర్‌సీ సెంటర్ వద్ద నిర్వహించిన డ్రోన్ డెమోను జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ స్వయంగా పర్యవేక్షించారు.
మూడంచెల భద్రతా వలయం
పోలింగ్ అనంతరం ఈవీఎంలను తిరిగి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియానికి తరలించి, స్ట్రాంగ్ రూమ్‌లలో భద్ర పరచనున్న నేపథ్యంలో, స్టేడియం వద్ద వెస్ట్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ పర్యవేక్షణలో కేంద్ర బలగాలతో సహా మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. నియోజక వర్గంలోని 68 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద సీఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించారు.
పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల ఫోకస్..
మరోవైపు, ప్రచారం ముగియడంతో ప్రధా న రాజకీయ పార్టీలు ఇప్పుడు పూర్తిగా పోల్ మేనేజ్‌మెంట్ పై దృష్టి సారించాయి. పోలింగ్ రోజున ఓటర్లను తమకు అనుకూలంగా పోలిం గ్ కేంద్రాలకు తరలించడం, పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు గమనించడం, ప్రత్యర్థుల ఎత్తుగడలను నిలువరించడం వంటి అంశాలపై తమ పార్టీ శ్రేణులకు వార్ రూమ్‌ల నుంచి సూచన లు అందిస్తున్నాయి.
గెలుపే లక్ష్యంగా చివరి నిమిషం వరకు వ్యూహ, ప్రతివ్యూహాలతో పార్టీ లు సిద్ధమయ్యాయి. మొత్తం 58 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 4 లక్షల మందికి పైగా ఓటర్లు మంగళవారం ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా 24 గంటల పాటు పనిచేసే 1950 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు.