19 April, 2026 | 2:20 AM

అడవి బిడ్డల గుండెల్లో మానని గాయం

19-04-2026 12:40 AM

ఇంద్రవెల్లిలో అమరవీరుల స్థూపం

  1. ఇంద్రవెల్లి నెత్తుటి ఘటనకు రేపటితో 45 ఏండ్లు

గతంలో ఆంక్షలతో కూడిన నివాళి.. 

నేడు అధికారికంగా కార్యక్రమాలు

బీర్కూర్ వార్ వెంకటేష్, ఆదిలాబాద్, విజయక్రాంతి: భూమి.. భుక్తి.. విముక్తి.. నినాదంతో తమ హక్కుల కోసం తుడుం మోగించి పోరాడిన అడవి బిడ్డలపై కురిసిన తుపాకీ గుండ్ల వర్షానికి నిలువెత్తు సాక్ష్యమే ఈ ఎరుపు రంగు స్థూపం. ఈ పోరాటంలో పోలీసుల తూటాలకు 13 మంది అమాయక అడవి బిడ్డలు అమరులయ్యారు. ఈ నెత్తుటి గాయన్ని మిగిల్చిన ఘటనకు 45 ఏండ్లు గడిచాయి. 1981 ఏప్రిల్ 20న జరిగిన ఈ సంఘటన ఆదివాసి గిరిజనుల గుండెల్లో మాత్రం అది మానని గాయంగానే మిగిలిపోయింది.

మరోవైపు ఈ ఘటనకు నిదర్శనంగా నిలుస్తున్నది ఇంద్రవెల్లిలోని నిలువెత్తు అమరవీరుల స్మారకం. ఈ స్థూపం ఆ దారి వెంట వచ్చిపోయే వారికి నాడు జరిగిన సంఘటనలో అమరత్వం పొందిన ఆదివాసీ గిరిజన వీరుల త్యాగాలను గుర్తుచేస్తూనే ఉన్నది. 

అసలు ఆ రోజు ఏం జరిగింది?

అసలు ఆరోజు జరిగింది ఏమిటి? ఎందుకు 13 మంది అమరులయ్యారు? ఆదివాసీ గిరిజనులు చట్టబద్ధమైన హక్కుల కోసం రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు  పోరుబాట పట్టారు. దౌర్జన్యాలను ఎదిరించడం మొదలు పెట్టారు. భూ సమస్య పరిష్కారం కోసం తుడుం మోగించి పోరును మరింత ఉధృతం చేశారు. ఇందులో భాగంగా ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20న బహిరంగ సభ ఏర్పాటుచేశారు.

ఆ రోజు సోమవారం, వారాంతపు సంత కూడా కావడం, మరోవైపు బహిరంగ సభను ఏర్పాటు చేయడంతో భారీ సంఖ్యలో ఆదివాసీ గిరిజనులు తరలివచ్చారు. తొలుత సభకు అనుమతినిచ్చినా ఆ తర్వా త ఈ సభకు అనుమతి లేదని భారీగా పోలీసులను మోహరించారు. సభను అడ్డుకునే ప్రయత్నం కూడా జరిగింది. పోలీసులు 144 సెక్షన్ విధించారు. అయినా ఆదివాసీ గూడల నుంచి తరలివచ్చిన అడవి బిడ్డలతో ఇంద్రవెల్లి జనసంద్రంగా మారింది. పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టి జనాలను అదుపు చేసే ప్రయత్నంచేశారు.

ఈ క్రమంలో పోలీసులు, ఆదివాసీలకు మధ్య మాటామాటా పెరిగి పరిస్థితి కాల్పులకు దారితీసింది. అప్పటి ఆర్డీవో ఆదేశాల మేరకు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 13 మంది అమాయక ఆదివాసీలు చనిపోయినట్టు ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నది. అయితే అంతకన్నా ఎక్కువ మందే మరణించార ని పౌర హక్కుల సంఘాలు పేర్కొన్నాయి. చాలా మంది గాయాలతో బయటపడ్డారు. అప్పటి నుంచి ఏటా ఏప్రిల్ 20న ఇంద్ర వెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటూ అమరులకు నివాళి అర్పించడం అనవాయితీగా వస్తున్నది.

అమరుల స్మారకార్ధం అడవిలో వెలసిన స్థూపం

పోలీసుల కాల్పుల ఘటనలో మృతి చెందిన ఆదివాసుల స్మారకార్ధం రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో 80 అడుగుల స్థూపాన్ని నిర్మించారు. కానీ ఆ స్థూపాన్ని 1986లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పేల్చివేశారు. దీంతో ఆదివాసులు స్థూపం కోసం చేపట్టిన ఆందోళనల ఫలితంగా మరోసారి 1987లో స్థూపాన్ని నిర్మించారు. ఇక్కడే ఏటా ఏప్రిల్ 20న అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారు.

ఏప్రిల్ 20న ఈ ప్రాంతంలో 144 తోపాటు పలు ఆంక్షలు విధించేవారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆంక్షలను కొంత సడలించడం తో గిరిజన సంఘాలు, ప్రతినిధులు, ఆదివాసీ గిరిజనులు ఇంద్రవెల్లి స్థూపం వద్దకు వచ్చి నివాళులు అర్పిస్తున్నారు.

అమరవీరుల స్థూపంపై సీఎం ప్రత్యేక దృష్టి

ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్థూపంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్ది ప్రత్యేక దృషి సారించారు. సీఎంగా బాధ్యతలను చేపట్టిన తర్వాత ఇంద్రవెల్లి ఘటనలో అమరులైన వారి కుటుంబాలకు కొంత ఓదార్పు నిచ్చారు. పోలీసుల రికార్డు ప్రకారం 15 మంది అమరవీరుల కుటుంబాలకు ఇంటి స్థలాలను కేటాయించారు. రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరుచేశారు.

వీరికి ఐటీడీఏ ద్వారా రుణాల చెల్లింపునకు హామీ కూడా ఇచ్చా రు. ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని స్మృతి వనంగా తీర్చిదిద్దేందుకు రూ.97 లక్షలను కేటాయించి పనులను ప్రారంభించా రు. స్మృతి వనం పనులు పూర్తికావడంతో ఇప్పుడు ఆ ప్రాంతం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తలపిస్తున్నది.