31-05-2025 04:49:48 PM
-దివంగతుడు కాదు ఎంతోమంది గుండెల్లో నిలిచిన సూపర్ స్టార్ కృష్ణ
-సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): దివంగత, సూపర్ స్టార్ కృష్ణకు దేవుడు అనే పేరు ఊరికే రాలేదని మహబూబ్ నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్(Former Municipal Chairman Anand Goud) అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పాత డీఈఓ కార్యాలయం సమీపంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నీతికి నిజాయితీకి నిలువ నిదర్శనం సూపర్ స్టార్ కృష్ణ అని కొనియాడారు. గతంలో సినిమాలు తనవి ఆడకపోయినప్పటికీ నిర్మాతలు నష్టపోతే వారికి ప్రత్యేకంగా డేట్లు ఇవ్వడంతో పాటు అవసరమైన రెవెన్యూ సదుపాయాలను కూడా కల్పిస్తూ భరోసానిస్తూ వారి ఎదుగుదలకు తోడ్పాటున అందించారన్నారు.
ఎంతోమంది పేద కళాకారులకు సహాయ సహకారాలు అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. నిజజీవితంలో కూడా సూపర్ స్టార్ కృష్ణ సూపర్ స్టార్ గానే ఎంతోమంది గుండెల్లో నిలిచిపోయారని చెప్పారు. తనదైన శైలిలో నటించి అందరిని మెప్పించి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ పేద కళాకారులను ఉన్నత స్థాయికి తీసుకువచ్చేందుకు ఎంతో శ్రమించారని గుర్తు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాధా అమర్, ఎక్స్ కౌన్సిలర్ కిట్టు, ప్రశాంత్, పాషా, గిరిబాబు, మోతిలాల్, హనుమంతు, సూపర్ స్టార్ కృష్ణ అసోసియేషన్ రాజగోపాల్, పాతూరు రమేష్, రఘుపతి రెడ్డి తదితరులు ఉన్నారు.