calender_icon.png 11 November, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందెశ్రీ ఇకలేరు - కాలంగన్న కవి అస్తమయం

11-11-2025 01:56:00 AM

  1. ప్రజావాగ్గేయకారుడు అందె ఎల్లయ్య కన్నుమూత

  2. లాలాపేట్‌లోని స్వగృహంలో గుండెపోటు
  3. గాంధీ ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
  4. అప్పటికే మృతిచెందాడని నిర్ధారించిన వైద్యులు
  5. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
  6. భౌతిక కాయానికి ప్రజాప్రతినిధులు, కవులు, కళాకారుల నివాళి

* తండ్రి పాలన, తల్లి లాలనకు నోచుకోనివాడు. పాలబుగ్గల పసివాడిగా పశుల గాసిన వాడు. ప్రకృతి ఒడిన ఒదిగి పాట నేర్చినాడు. పలకా బలపం పట్టకుండ పదాలల్లినాడు. సరిగమలు తెలియకుండ పాట కట్టినాడు. కాలం కన్నకవిగా ఎదిగినవాడు. లోకకవిగా వాసికెక్కినవాడు. ‘కొమ్మచెక్కితె బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మ రా’ అని పరవశించి, ‘జన జాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి’ అని గర్జించి, ‘మాయమైపోతున్నడమ్మా.. మనిషిన్నవాడు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసి, ‘జయహే జయహే తెలంగాణ’ అని ఆలపించి, రాష్ట్ర గీతమిచ్చి, అలసి సొలసి శాశ్వతంగా విశ్రమించినాడు. రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగ మిగిలి దివికేగినాడు.. ఆతడు అందెశ్రీ!

కాలంగన్న కవి అస్తమయం

ప్రజావాగ్గేయకారుడు అందెశ్రీ కన్నుమూత

* జయజయహే తెలంగాణ.. 

జననీ జయకేతనం

ముక్కోటి గొంతుకలు 

ఒక్కటైన చేతనం

తరతరాల చరిత గల 

తల్లీ నీరాజనం

పద పదాన నీ పిల్లలు 

ప్రణమిల్లిన శుభ తరుణం

హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): ప్రజా వాగ్గేయకారుడు అందెశ్రీ (64) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని లాలాగూడ స్వగృహంలో ఆయన సోమవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురయ్యారు. గుర్తించిన కుటుంబసభ్యులు ఆయన్ను హూటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆయన మృతితో అభిమానులు, సాహితీ లోకం విషాదంలో మునిగింది.

ఆయన మృతితో ఆయన స్వగ్రామం రేబర్తిలో విషాద ఛాయలు అలముకున్నాయి. తెలంగాణ ఉద్యమ సాధనలో ఆయన కృషి అనన్య సామాన్యం. ‘జయహే తెలంగాణ.. జననీ జయకేతనం’. ‘జన జాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి’ అన్న పాటలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిపోశాయి. ఆయన కృషికి గాను తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రూ.కోటి నగదు సాయం ప్రకటించింది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆయన రూ.కోటి నగదు పురస్కారాన్ని అందుకున్నారు. 

ప్రకృతే ప్రేరణ

అందెశ్రీ నాటి వరంగల్ జిల్లా (ప్రస్తుతం సిద్దిపేట జిల్లా) మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో 1961 జూలై 18న జన్మించారు. అందెశ్రీ చిన్నతనం నుంచే కష్టాలను అనుభవించారు. కడుపేదరికాన్ని చవిచూశారు. ఈయన ఒక అనాథగా పెరిగారు. ఆయనకు తన తల్లిదండ్రులు ఎవరో తెలియదు. జీవనం కోసం కొన్నాళ్లు గొర్రెల కాపరిగా పనిచేశారు. అక్కడి నుంచే ఆయన కవిత్వం రాయడం ప్రారంభించారు. ఆయన ఏ విధమైన చదువు చదవలేదు.

పశువులను కాసేందుకు వెళ్లినప్పుడు.. అక్కడి ప్రకృతిని చూసి, పంటలను, అడవిని చూశాక తనలో సహజసిద్ధంగా కవి ఉద్భవించాడు. ఎలాంటి సాహిత్య పరిచయం లేండానే తెలుగు భాషపై పట్టుసాధించారు. ఎదుగుతున్న క్రమంలో అగ్రశ్రేణి కవుల్లో ఒకరిగా ఎదిగారు. ఆయన పాటల్లో తెలంగాణ గ్రామీణ జీవితం, యాస, సంస్కృతి, ఉద్యమ స్ఫూర్తి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కేవలం ఆయన కవిగానే కాక, రాష్ట్రసాంస్కృతిక, రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. ఆయన తన పాటలతో, కవిత్వంతో తెలంగాణ ఉద్యమంలో నూతనోత్తేజం నింపారు.

ప్రత్యేకమైన శైలి

‘జయ జయహే తెలంగాణ’ గీతం అందెశ్రీ రాసిన అన్ని పాటల్లోకెల్లా అత్యంత ప్రజాదారణ పొందింది. రాష్ట్రప్రజల గుండెల్లో నిలిచింది. ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించింది. ‘ఎర్ర సముద్రం’ సినిమా కోసం ఆయన రాసిన ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ అన్న పాట కేవలం సినీ గీతంగా మిగిలిపోలేదు. అది ప్రతి మనిషి అంతరాత్మను ప్రశ్నించేలా చేసింది. కనుమరుగవుతున్న మానవతా విలువలను కళ్లకు కట్టింది.

ఈ పాట ఇప్పటికీ, ఎప్పటికీ తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయే ఒక తాత్విక గీతం. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో అందెశ్రీ పాటలు తూటాల్లా పేలాయి. ‘జై బోలో తెలంగాణ’ చిత్రానికి ఆయన రాసిన ‘జన జాతరలో మన గీతం’ ఉద్యమకారుల్లో నూతనోత్తేజాన్ని నింపింది.  ప్రకృతిపై తనకున్న అపారమైన ప్రేమను చాటుతూ అందెశ్రీ రాసిన ‘పల్లె నీకు వందనాలమ్మా పాట’ ఇప్పటికీ ప్రజల మనసుల్లో స్థిరపడింది. ‘గల గల గజ్జలబండి.. ఘల్లు చూడు’ అంటూ తన సొంత జిల్లా ఓరుగల్లు గురించి గొప్పగా ఆయన పాట రాశారు.

అందెశ్రీ తన కవిత్వం, పాటలు ఆలపించేటప్పుడు ఆయన ఒక ప్రత్యేకమై శైలి అవలంబిస్తారు. పాట పాడేటప్పుడు కళ్లు మూసుకుని, తల ఊపుతూ, గంభీరంగా, తన్మయంతో పాడటం ప్రేక్షకులను పరవశింపజేస్తుంది. అలాగే అశు కవిత్వం చెప్పడంలో, జానపదాలకు జీవం పోయడంలో అందెశ్రీ దిట్ట. మట్టి మనుషుల కష్టాలను, జమీందార్ల దోపిడీని, బక్కజీవుల బతుకు చిత్రాలను తన పాటలతో కళ్లకు కట్టారు. 

అందుకున్న పురస్కారాలు

2006లో ‘గంగ’ సినిమాలో అందెశ్రీ రాసిన ‘వెళ్లిపోతున్నావా తల్లి’ అనే పాటకు నంది పురస్కారం వరించింది.. 2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం, 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో అందెశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం.. అలాగే.. లోక్ నాయక్ పురస్కారాన్ని అందెశ్రీ అందుకున్నారు. 

అశ్రునివాళి

కుటుంబ సభ్యులు అందెశ్రీ పార్థివ దేహాన్ని ప్రొఫెసర్ జయశంకర్ ఇండోర్ స్టేడియానికి తరలించారు. ఆయన భౌతిక దేహానికి కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీలు ఈటల రాజేందర్, మల్లు రవి, ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, గాయని విమలక్క, ప్రొఫెసర్ కోదండరాం, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ప్రముఖ కవులు, రచయితలు, కళాకారులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి నివాళి అర్పించారు.

ప్రముఖుల సంతాపం

అందెశ్రీ మృతిపట్ల సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణ సాహితీ లోకాని తీరని లోటని పేర్కొన్నారు. అలాగే మాజీ సీఎం కేసీఆర్, కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, తెలంగాణ మంత్రులు, వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, సినీ, సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ తదితరులు ఆయన మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ఆ భగవంతులు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.

నేడు అంత్యక్రియలు

అందెశ్రీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావుకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఘట్‌కేసర్ సమీపంలోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో మంగళవారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి. అంతిమ సంస్కారాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. అంత్యక్రియల ఏర్పాట్లను హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి, సీపీ సజ్జనార్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

రాసిన పాటలు మచ్చుకుని కొన్ని

మాయమైపోతున్నడమ్మ.. మనిషన్నవాడు!

మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు !

మచ్చుకైనలేదు చూడు మానవత్వము ఉన్నవాడు

నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఏడ ఉన్నదో కాని.. కంటికీ కానరాడు

          ****************

నిలువెత్తు స్వార్థము నీడలా వెంటుంటే చెడిపోక ఎమవుతడమ్మా

ఆత్మీయ బంధాలు ప్రేమ సంభందాల దిగజారుతున్నదోయమ్మా

అవినీతి పెనుఆశ అంధకారములోన చిక్కుకొని నరుడు శిథిలమవుతున్నాడు

రాల్లురప్పల దైవ రూపాలుగా కోలచు పంది నందిని చూసి పదిమొక్కుతుంటాడు

          ******************

చీమలకు చెక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవనము అంటాడు

సాటి మనిషికి కాస్త సాయంబు నీయకాకులమంటూ ఇల మీద కలహాలగిరిగీసి

          ****************

ఆధ్యాత్మికతకున్న అర్థమే తెలియకా ఆగమయిపోతున్నడమ్మా

హిందూ, ముస్లిము, క్రీస్తు, సిక్కు , పారసీలంటూ తననుతా మరిచేనోయమ్మా

మతము లోకహితము అన్న మాటను మరచి.. మత ఘర్శనలమద్య మనిషి కనుమరుగవుతూ

         **********************

ఇరువయీదు పైసల లగారు వత్తులు కాల్చి అరువైఇదు కోట్ల వారము లడుగుతాడు

దైవాలపెరుతో చందాల కైదండా భక్తి ముసుగుగులో భల ఫోజు కొడతాడు

ముక్తి పేరిట నరుడు రక్తి లో రానిల్లి.. రాకాసి రూపాన రంజిల్లు లోకాన

జయజయహే తెలంగాణ 

జననీ జయకేతనం

జయజయహే తెలంగాణ.. జననీ జయకేతనం

ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం

తరతరాల చరిత గల తల్లీ నీరాజనం

పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం

     ****************

జై తెలంగాణ..జైజై తెలంగాణ..

జై తెలంగాణ..జైజై తెలంగాణ

     ******************

జానపద జనజీవన జావళీలు జాలువార

కవి గాయక వైతాళిక కళలా మంజీరాలు

జాతిని జాగృత పరిచే గీతాల జన జాతర

అను నిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం

     *****************

జై తెలంగాణ..జైజై తెలంగాణ

జై తెలంగాణ..జైజై తెలంగాణ

     *****************

గోదావరి కృష్ణమ్మలు..తల్లీ నిన్ను తడుపంగా

పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా

సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి

ప్రతి దినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి

    *****************

జై తెలంగాణ ..జైజై తెలంగాణ

జై తెలంగాణ..జైజై తెలంగాణ

జన జాతరలో మన గీతం

జన జాతరలో మన గీతం

జయకేతనమై ఎగరాలి

జంఝా మారుత జన నినాదమై

జే గంటలు మోగించాలి

ఒకటే జననం ఓహో!

ఒకటే మరణం ఆహా!

జీవితమంతా ఓహో!

జనమే మననం ఆహా!

కష్టాల్ నష్టాలెన్నెదురైనా

కార్యదీక్షలో తెలంగాణ

  ***************

దేశముఖులను దొరభూస్వాముల

గడీల నుండి ఉరికించాం

రజాకారులను తరిమికొట్టి

నైజాముకే గోరి గట్టేశాం

రోషం గుండెల ఓహో

రోకలి బండలు ఆహా !

బిగిసిన పిడికిళ్ళు ఓహో!

వడిశెల రాళ్ళు ఆహా!

వేలకువేలా బలిదానాల

వీరులు చేప్పిన దారుల్లో

జై బోలో తెలంగాణ

గళగర్జనల జడివాన

కొమ్మ చెక్కితె బొమ్మరా కొలిసి మొక్కితె అమ్మరా

కొమ్మ చెక్కితె బొమ్మరా కొలిసి మొక్కితె అమ్మరా

ఆదికే ఇది పాదురా కాదంటె ఏదీ లేదురా

జాతి గుండెలో జీవ నదముల జాలువారే జానపదముల

గ్రామములు కాపాడ వెలిసిరి గ్రామ దేవతలెందరోయిట

          ******************

గూడుగట్ట గుహలనొదిలీ గుండె రాయి జేసుకున్నరు

కండలను కరిగించి కన్న కలలను పండించుకొన్నరు

సేదదీరి మనసులోన శక్తి ఏదో ఉన్నదనుకొని

భక్తీ యుక్తులు ధారపోయగా ముక్తి నొసగ శక్తి బుట్టె%.

         *******************

%కన్న తల్లిని పరశురాముడు కాని కష్టాలెన్నో బెట్ట

ఇంటి ఇంటికి బోయి నను కాపాడమని కన్నీరుబెట్ట

ఎల్లరు కాదంటే మాదిగ ఇంటి లందల్లోనదాగీ

సబ్బండ జాతులు కొలువ పల్లెల కులముల ఎల్లమ్మ బుట్టె%

       *********************

%పల్లె సీమలు పచ్చగుండా ఊరు వాడా సిరులు నిండ

ఎటికడ్డము నీటి నిలువా కట్టడాలకు కాపు తానై

చెరువు కుంటలే కాదు బతుకు దెరువు కోసం ఏది జేసినా

మానవుల నమ్మకములో మైసమ్మ పురుడు వోసుకున్నది