11-11-2025 01:58:05 AM
అందెశ్రీ మరణం పూడ్చలేనిది
అందెశ్రీ మరణం మన సాంస్కృతిక, మోధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ప్రజల పోరాటాలకు, ఆకాంక్షలకు ఆయన గొంతుకగా నిలిచారు.. ఆయన పదాలకు హృదయాలను కదిలించే అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ఏకం చేసే శక్తి ఉన్నాయి. ఆయన సామాజిక స్పృహను సాహితీ సౌందర్యంతో మిళితం చేసిన విధానం అద్వితీయం. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి.
మోదీ, ప్రధానమంత్రి
ఆయన పాటలు ప్రజల హృదయాల్లో ఎప్పుడూ ఉంటాయి
అందెశ్రీ రాసిన అనేక పాటలు ప్రజల హృదయాల్లో ఎల్లప్పుడూ నిలిచిపోతాయి.ఆయన పాటలతో లక్షలాది మందిలో స్ఫూర్తి రగలించారు. ప్రపంచవ్యాప్తంగాఉన్న నదులపై పరిశోధనల చేసి పుస్తకం రాయాలనే కోరిక తీరకుండానే ఆయన మనకు దూరమయ్యారు. సహజ కవి స్వర్గస్తులు కావడాన్ని తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతోంది. సమాజంలో మార్పు రావాలని, ప్రజల్లో చైతన్యం కలిగించాలని ప్రతిక్షణం ఆలోచించేవారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
కేంద్రమంత్రి
మరణం దిగ్భ్రాంతి కలిగించింది
సహజ కవి, రచయిత అందెశ్రీ మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. చదువులేకపోయినా జీవిత అనుభవాలనే పాటలుగా రచించిన సహజ రచయిత అందెశ్రీ. తెలంగాణ అభివృద్ధి, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచించే గొప్ప వ్యక్తి అందెశ్రీ. పాటల రూపంలో ఆయన సజీవంగానే ఉంటారు. అందెశ్రీ ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా.
బండి సంజయ్, కేంద్రమంత్రి
సాహితీ శిఖరం నేలకొరిగింది
ప్రముఖ రచయిత, కవి, తెలంగాణ రాష్ర్ట గీత రచయిత అందెశ్రీ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతికి గురయ్యారు. తెలంగాణ సాహితీ శిఖరం నేల కూలిందంటూ సంతాపం వ్యక్తం చేశారు. అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ర్ట గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామన్నారు. స్వరాష్ర్ట సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.. అందెశ్రీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా.
రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
సాంస్కృతిక ఉద్యమంలో అందెశ్రీది కీలక పాత్ర
రాష్ట్ర సాధన సాంస్కృతిక ఉద్యమంలో అందెశ్రీది కీలక పాత్ర తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో, కవిగా తన పాటలతో, సాహిత్యంతో కీలక పాత్ర పోషించారు. అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
కేసీఆర్, మాజీ సీఎం
తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు
అందెశ్రీ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణం తెలంగాణ సాహితీ లోకానికి, రాష్ట్రానికి తీరని లోటు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
అకాల మరణం బాధాకరం
అందెశ్రీ అకాల మరణం బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.
మాజీ మంత్రి
తెలంగాణకు తీరని లోటు
ప్రముఖ కవి, ఉద్యమకారుడు, సాహితీవేత్త అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు. ఆయన ఆకస్మిక మరణ వార్త తీవ్రంగా కలచివేసింది. తెలంగాణ సాహితీ లోకంలో ఒక మహానుభావుడిని, ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే కవిని కోల్పోయాం. “జయ జయహే తెలంగాణ” పాట ద్వారా తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ర్ట ఉద్యమాన్ని బలోపేతం చేసిన అందెశ్రీ సేవలు మరువలేనివి. రాష్ర్ట అవతరణలో ఆయన పాత్ర అత్యంత కీలకమైంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ,ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా.
మహేశ్‌కుమార్ గౌడ్, టీపీసీసీ చీఫ్
అరుదైన కవి
అందెశ్రీ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించిన అరుదైన కవి. ఆయనతో చాలాకాలంగా సన్నిహిత సంబంధం ఉంది. ఆయన మరణ వార్త వినగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల్లో ఆత్మగౌరవ స్ఫూర్తిని రగిలించిన ఆయన రచనలు చిరస్మరణీయం. జయజయహే తెలంగాణ జననీ జయకేతనం రాష్ట్రగీతంగా చరిత్రలో నిలిచిపోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.
అందెశ్రీ పాటకు మరణం లేదు
ప్రజాకవి, రచయిత అందెశ్రీ హఠాన్మరణం బాధాకరం. 2004లో సంగారెడ్డిలో ధూంధాంతో ఆయన పాటతో నాకు పరిచయమైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో అందెశ్రీ పాటలు ప్రజలను చైతన్యపరిచాయి. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలది ప్రధాన పాత్ర. ఆయన మరణం తెలంగాణ ప్రజలకి తీరనిలోటు. అందెశ్రీ పాటకి మరణం లేదు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
చాలా బాధాకరం
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందే శ్రీ త్యాగాన్ని గుర్తించలేదు. అందెశ్రీ ఇంత త్వరగా చనిపోవడం చాలా బాధాకరం. తెలంగాణ ఉద్యమంలో పనిచేశాడు. పెద్దగా చదువుకోకపోయినా మానవత్వం అనే ఆలోచనతో కష్టపడ్డాడు. గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్న అందెశ్రీ త్యాగాల గురించి ఆలోచించలేదు.. ఆయన రాసిన పాటను పట్టించుకోలేదు.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే అందెశ్రీ రాసిన పాటను రాష్ట్రీయగీతంగా గుర్తించారు.
వీహెచ్, కాంగ్రెస్ సీనియర్ నేత