16 May, 2026 | 9:02 PM

విద్యార్థుల అసభ్య ప్రవర్తనపై ఆగ్రహం

04-02-2025 10:56 PM

సామనగర్ కాలనీవాసుల ఆందోళన

వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు 

ఎల్బీనగర్ : హయత్ నగర్ పరిధిలోని సామ నగర్ లో ఉన్న నారాయణ కళాశాల ఎదుట మంగళవారం కాలనీవాసులు ఆందోళనకు దిగారు. నారాయణ కళాశాల ఇంటర్మీడియట్ హాస్టల్ విద్యార్థులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు, మహిళలు మాట్లాడుతూ.. మహిళలు రోడ్డు పై వెళ్తున్నపుడు ఇంట్లో బాల్కనీ లో ఉన్నపుడు  పైకి పేపర్ రాకెట్లు విసిరేస్తూ,లేజర్ లైట్లు కొడుతూ బూతు మాటలు తిడుతున్నారని తెలిపారు. హాస్టల్ లో విద్యార్థులు స్నానం చేసి వచ్చి కిటికీలో నుంచి టవల్ విప్పి న్యూడ్ గా చూడమంటూ కేకలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో ఉండాలంటే కూడా భయంగా ఉందంటూ కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు.

కాలనీ మహిళలు తమ కుటుంబ సభ్యులు ఇంట్లో బాల్కనీలో ఉండి కూడా ఏదైనా పని చేసుకుంటే అసభ్యంగా కామెంట్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయాన్ని నారాయణ కళాశాల యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోవడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణ కళాశాల యాజమాన్యం పిల్లలకు చదువు నేర్పించడం లేదని,  మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించాలని నేర్పిస్తున్నారని మహిళలు మండిపడ్డారు. నారాయణ కళాశాలను ఇక్కడ నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. అనంతరం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.