12 August, 2026 | 2:42 AM

సంతాన మల్లికార్జునుడికి అన్నాభిషేకం

12-08-2026 12:41 AM

మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు.. 

భక్తులకు అన్నప్రసాద వితరణ

కొండపాక, ఆగస్టు 11 (విజయక్రాంతి): కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకొని మంగళవారం స్వామివారికి అన్నాభిషేకాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 9 గంటలకు క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాథ శర్మ పర్యవేక్షణలో గణపతి పూజతో కార్యక్రమానికి ప్రారంభించారు. లఘున్యాసపూర్వకంగా సంతాన మల్లికార్జున స్వామివారికి పంచామృతాలు, వివిధ రకాల ఫలరసాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు.

అనంతరం స్వామివారికి అన్నపూజను వైభవంగా చేపట్టారు. విజయదుర్గా అమ్మవారి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో గట్టు విఠల్, సురేందర్ రెడ్డి, జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు.