సుహాస్ ప్రీతమ్‌కు మరో స్వర్ణం
జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ చాంపియన్ షిప్
భువనేశ్వర్, ఆగస్టు 21: 52వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ చాంపియన్ షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు అదరగొడుతున్నారు. చాలా విభాగాల్లో పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా తెలంగాణ యువ స్విమ్మర్ సుహాస్ ప్రీతమ్ మైలారి మరో స్వర్ణం గెలుచుకున్నాడు. పురుషుల 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ రేసును సుహాస్ కేవలం 26.95 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. ఈ పోటీలో తెలంగాణకు ఇది రెండో స్వర్ణం.
కర్ణాటక స్విమ్మర్ ఆర్యన్ అభిజిత్ పాటిల్ 27.54 సెకన్లలో రేసు పూర్తి చేసి సిల్వర్ మెడల్ గెలవగా, కర్ణాటకకే చెందిన మరో స్విమ్మర్ అమన్ అభిజిత్ సింగాన్ 27.57 సెకన్లలో పూర్తి చేసి కాంస్యం సాధించాడు. గచ్చిబౌలి స్టేడియం స్విమ్మింగ్ కోచ్ ఆయుష్ యాదవ్ దగ్గర సుహాస్ శిక్షణ తీసుకుంటున్నాడు. స్పోరట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ సుహాస్ ప్రీతమ్‌తో పాటు కోచ్ ఆయుష్ యాదవ్ ను ప్రత్యేకంగా అభినందించారు.






