22 August, 2026 | 2:49 AM

ఖర్గేకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు

22-08-2026 01:54 AM
  1. చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
  2. ఫిర్యాదుపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగుచర్యలు తీసుకుంటామని ఖర్గే హామీ

వనపర్తి, ఆగస్టు 21 (విజయక్రాంతి): వనపర్తి కాంగ్రెస్లో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఢిల్లీకి చేరాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను శుక్రవారం ఢిల్లీలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కలసి ఫిర్యాదు చేశారు. వనపర్తి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, పట్టణ, మండల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులతో కలిసి ఖర్గే నివాసానికి వెళ్లిన మేఘారెడ్డి.. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించిన బీఫారాలను డబ్బులకు అమ్ముకున్నారంటూ చిన్నారెడ్డి చేసిన ఆరోపణలపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని ఖర్గేను కోరినట్లు మేఘారెడ్డి వెల్లడించారు.

తాను ఇచ్చిన ఫిర్యాదుపై ఖర్గే సానుకూలంగా స్పందించారని, ఈ అంశంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి వాస్తవాలను పరిశీలించిన అనంతరం తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసినట్లు ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, పట్టణ, మండల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.