calender_icon.png 5 July, 2025 | 10:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్షణశాఖకు మరో లక్ష కోట్లు

05-07-2025 02:03:08 AM

ఆపరేషన్ సిందూర్ అనంతరం తొలిసారి డీఏసీ సమావేశం

న్యూఢిల్లీ, జూలై 4: ఆపరేషన్ సిందూర్ అనంతరం శుక్రవారం డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) సమావేశం అయింది. మిలటరీ హార్డ్‌వేర్‌కు సంబంధించిన 10 ప్రతిపాదనలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అందులో భాగంగా రక్షణ శాఖకు రూ. 1.05 లక్షల కోట్ల రూపాయలు కేటాయించేందుకు అంగీకరించింది. ఇప్పటికే రూ. 6.81 లక్షల కోట్లు కేటాయించగా.. తాజాగా మరో రూ. 1.05 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ డిఫెన్స్ ఆక్విజిషన్ కౌన్సిల్ సమావేశానికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. అత్యవసర అంగీకారం కింద ఈ బడ్జెట్‌ను కేటాయించేందుకు ఆమోదం లభించింది. త్రివిధ దళాలకు కొత్త ఆయుధాల సేకరణ, ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టం, కొత్త ఆయుధాల తయారీ తదితర అవసరాల కోసం బడ్జెట్‌ను కేటాయించనున్నారు. భూమిపై నుంచి గాలిలోకి వెళ్లి దాడి చేసే మిస్సైళ్లను భారీ ఎత్తున సమకూర్చుకోనున్నారు.

ఈ సమావేశం సందర్భంగా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘త్రివిధ దళాలు ఏ సమయంలోనైనా ముందస్తు ప్రణాళిక కోసం ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది. దీని వలన సప్లు చైన్ మెరుగవుతుంది. ఎయిర్ డిఫెన్స్ మరింత ప్రభావితంగా పని చేస్తుంది. రక్షణ రంగం మరింత బలపడుతుంది. భూమి నుంచి గగనతలానికి ఉపయోగించే మిసైల్స్ ద్వారా గగనతల రక్షణ వ్యవస్థ మరింత బలపడుతుంది.’ అని పేర్కొన్నారు.