13 May, 2026 | 5:50 PM

రాష్ట్రానికి మరో 200 మెగావాట్ల సౌర విద్యుత్

28-08-2024 03:00 AM

సరఫరాకు ముందుకొచ్చిన నేవేలి లిగ్నైట్

8.9 మిలియన్ టన్నుల కర్బన ఉద్ఘారాలకు చెక్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో సౌర విద్యుత్ 

త్వరగా ఒప్పందాలు చేసుకోవాలని ప్రభుత్వానికి కిషన్‌రెడ్డి సూచన 

హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): తెలంగాణ భవిష్యత్ విద్యుత్ అవసరాలను తీర్చేదిశగా జరుగుతున్న ప్రయత్నానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి చొరవతో ముందడుగు పడింది. ఫలితంగా ఏటా 200 మెగావాట్ల సౌర విద్యుత్ రాష్ట్రానికి అందించేలా ఆయన మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉన్న నేవేలీ లిగ్నుటై కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ సంస్థ (ఎనెల్పీ) అంగీకరించింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఐఆర్‌ఈడీఏ) పథకంలో భాగంగా సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ స్కీమ్‌కు లోబడి నేవేలీ లిగ్నుటై కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ 510 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని గుజరాత్‌లోని కఛ్ జిల్లా బిబర్ ప్రాంతంలో ఏర్పాటుచేస్తోంది. రూ.1,214 కోట్లతో నిర్మిస్తున్న ఈ సౌర విద్యుదుత్పత్తి కేంద్రం పనులు పూర్తి కావొచ్చాయి.

2025 జూన్ నుంచి ఈ ప్రాజెక్టు ద్వారా విద్యుదుత్పత్తి ప్రారంభమ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్ తెలంగాణ విద్యుత్ అవసరాలు తీర్చడంలో కీలకంగా మారనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.2.57/కిలోవాట్ అవర్‌కే విద్యుత్ అందుబాటులోకి వస్తోంది. దీని ద్వారా వచ్చే 25 ఏళ్లలో దాదాపు రూ.2 వేల కోట్లు తెలంగాణ ట్రాన్స్‌కోకు ఆదా అవుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రధాని మోదీ హరిత విద్యుదుత్పత్తి లక్ష్యాలను మరో అడుగు ముందుకు పడనుంది.

తెలంగాణలోనే  సోలార్ ప్యానెళ్ల  ఉత్పత్తి

ఈ సోలార్ ప్యానెళ్లతోపాటు సంబంధిత పరికరాలను తెలంగాణ మార్కెట్ నుంచే కొంటారు. దీంతో తెలంగాణలో సోలార్ ప్యానళ్ల ఉత్పత్తికి బాటలు పడతాయి. దీంతో ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి. తద్వారా రాష్ర్ట ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ఆదాయం కూడా సమకూరనుంది. ఈ సోలార్ ప్రాజెక్టు ద్వారా గ్రీన్ ఎనర్జీలో రాష్ర్ట భాగస్వామ్యాన్ని మరింత పెంచుతుంది.

ఈ సోలార్ ప్రాజెక్టు జీవిత కాలంలో సరఫరా చేసే 12.5 బిలియన్ యూనిట్ల గ్రీన్ ఎనర్జీ ద్వారా 8.9 మిలియన్ టన్నుల కర్బన ఉద్ఘారాలను అడ్డుకోవచ్చు. ఈ ప్రాజెక్టులో ఉన్న మరో ముఖ్యమైన విశేషమేమిటంటే, ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యానికి ఊతమిచ్చేలా ఈ ప్రాజెక్టులో వాడే అన్ని సోలార్ సెల్స్‌ను దేశీయంగా తయారైన వాటినే వినియోగిం చనున్నారు. అందుకే రాష్ర్ట ప్రభుత్వం ఈ దిశగా ముందడుగు వేసి వీలైనంత త్వరగా ఎనెల్సీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేసుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు.

కేంద్రం నుంచి విద్యుత్ సహకారం 

తెలంగాణలో విద్యుదుత్పత్తిని పెంచి ఇక్కడి గృహవినియోగ, పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తోంది. దాదాపు రూ.11 వేల కోట్లతో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో 2 విద్యుదుత్పత్తి కేంద్రాలను (మొత్తం 1,600 మెగావాట్ల సామర్థ్యం) రామగుండంలో ప్రధాని మోదీ ప్రారంభించారు. రామగుండంలో ఎన్టీపీసీ ఏర్పాటు చేసిన 100 మెగావాట్ల సామర్థ్యం గల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్‌ను కూడా 2022 జూలై 31న ప్రధాని జాతికి అంకితం చేశారు.

రాష్ర్టంలో నిర్మిస్తున్న ఇతర పవర్ ప్రాజెక్టులకు కూడా కేంద్రం ఇతోధికంగా సహాయం అందిస్తోంది. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో మరో 2,400 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్ కొనుగోలు విషయంలో రాష్ర్టం ముందుకొచ్చి ఒప్పందం చేసుకుంటే ఎన్టీపీసీ పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుంది. రాష్ట్రానికి విద్యుత్ పరంగా అన్ని విధాలుగా అండగా ఉన్నాం.  

 జి కిషన్‌రెడ్డి, కేంద్ర బొగ్గు, 

గనుల శాఖ మంత్రి