9 July, 2026 | 6:27 PM

వైభవంగా శ్రీ సాయిబాబా దేవాలయ 17వ వార్షికోత్సవ వేడుకలు

09-07-2026 05:36 PM

ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు... పెద్ద ఎత్తున  పాల్గొన్న భక్తులు

సుల్తానాబాద్, జూలై 9(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని(Sultanabad town) స్వప్న కాలనీలోని శ్రీ గణపతి దత్తాత్రేయ సుప్రభాత శ్రీ శిర్డీ సాయిబాబా దేవాలయ 17వ వార్షికోత్సవంమహోత్సవాలను గురువారం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా కన్నుల పండువగ నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి సాయిబాబా ను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, విశేష అభిషేకం, పంచామృతాభిషేకం, అష్టోత్తర శతనామార్చన, ప్రత్యేక అర్చనలు, హోమాలు, మంగళహారతులు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేయగా, మహామంగళహారతి తర్వాత భక్తులందరికీ మహా అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధన నాయక దామోదర్ రావు, కాంగ్రెస్ నాయకుడు అమ్మిరీశెట్టి తిరుపతి హాజరై స్వామివారినిదర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని సాయిబాబాను ప్రార్థించినట్లు తెలిపారు.వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులు మాటేటి కృష్ణప్రియ–సంజీవ్, ఎడవెల్లి భారతి–రాంరెడ్డి, మాడూరి అరుణ–ప్రసాద్, చకిలం రమాదేవి–సత్యనారాయణ, జూలూరిసునీతారాణి–అశోక్, వెంగళదాస్ రజని–శ్రీధర్, యెల్లెంకివిజయ–వైకుంఠం,ముస్త్యాలలావణ్య–నాగేశ్వర్, కట్ల శారద–సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వేదపండితులు బ్రహ్మశ్రీ ఉప్పరమల్యాల లక్షణశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించగా, కార్యక్రమ నిర్వహణను బ్రహ్మశ్రీ గూడ రమేష్ శర్మ చేపట్టారు.