వడ్డీతో సహా చెల్లిస్తా
జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత మాట్లాడుతూ.. తాను కష్ట సమయంలో ఉన్నప్పుడు తోడుగా ఉన్నవారికి కృతజ్ఞత లు తెలిపారు. జైలు నుంచి విడుదలయ్యా భావోద్వేగానికి గురైన ఆమె.. ఐదున్నర నెలలు తన పిల్లలకు దూరంగా ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. బయటికి వస్తూనే పిడికిలి బిగించి అభివాదం చేసిన కవిత.. 18 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని, తనను ఇబ్బంది పెట్టినవాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తానని శపథం చేశారు. వాళ్లు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
తాను మొండిగానూ మంచిగానూ ఉంటానని, కానీ అనవసరంగా జగమొండిగా మార్చారని వ్యాఖ్యానించారు. తాను కేసీఆర్ బిడ్డనని, తప్పు చేసే ప్రసక్తే లేదని చెప్పారు. ప్రజాక్షేత్రస్థాయిలో మరింత నిబద్ధతతో పనిచేస్తానని తెలిపారు. అన్యాయంపై న్యాయపరంగా, రాజకీయంగా పోరాడుతానని స్పష్టం చేశారు. రాజకీయ కక్షలో భాగంగానే తనను జైలుకు పంపారని, దీనిపై పోరాడి నిర్దోషిగా నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు.
బెయిల్ ప్రయత్నాలు
అరెస్టు తర్వాత తన కుమారుడికి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టు కవిత ఆశ్రయించారు. కానీ బెయిల్ లభించలేదు. అనంతరం ఈడీ, సీబీఐ కేసుల్లో సాధారణ బెయిల్ కోసం అర్జీ పెట్టుకోగా నిరాశే ఎదురైంది. ట్రయల్ కోర్టు తీర్పు పై ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేయగా అక్కడా ఫలితం లేకపోయింది. ఇదే సమయంలో కవితతో పాటు మరో నలుగు రిపై అభియోగాలు మోపుతూ ట్రయల్ కోర్టులో సీబీఐ సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో తప్పులు ఉన్నాయని, తనకు మద్యం పాలసీతో ఎలాంటి సంబంధం లేదని మరోసారి ట్రయల్ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను వెనక్కి తీసుకుని సుప్రీంకోర్టును ఆశ్రయించాల ని నిర్ణయించారు. చివరకు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఈ నెల 7న సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తూ కవిత సుదీర్ఘ ప్రయత్నాలకు ఊరటనిచ్చింది.






