14 July, 2026 | 4:42 AM

మంథని అభివృద్ధిలో మరో ముందడుగు

14-07-2026 12:00 AM
  1. 100 అడుగుల రహదారి విస్తరణ పనులు ప్రారంభం
  2. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో వేగంగా మంథని లో అభివృద్ధి పనులు

మంథని, జూలై 13(విజయ క్రాంతి) మంథని పట్టణ అభివృద్ధిలో కీలకమైన 100 అడుగుల ప్రధాన రహదారి విస్తరణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో చేపట్టిన ఈ పనులకు మున్సిపల్ పాలకవర్గం శ్రీకారం చుట్టింది. పట్టణంలోని ప్రధాన రహదారిపై కూరగాయల మార్కెట్ సమీపంలో రోడ్డుకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను మున్సిపల్ అధికారులు జేసీబీల సహాయంతో తొలగించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డి తన సొంత షాపును స్వచ్ఛందంగా కూల్చివేసి ప్రజాప్రయోజనాల కోసం ముందుకు రావడం విశేషంగా నిలిచింది. అనంతరం మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్తో కలిసి రహదారి విస్తరణ పనులను ప్రారంభించారు.మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు లక్ష్యంగా పెట్టుకున్న మంథని పట్టణ సమగ్ర అభివృద్ధిలో భాగంగా ఈ రహదారి విస్తరణ చేపట్టినట్లు మున్సిపల్ ప్రతినిధులు తెలిపారు. రహదారి విస్తరణ పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, వ్యాపారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.