గల్ఫ్ కార్మికుల కష్టాలకు కారణం కాంగ్రెస్సే

29-04-2024 12:08:33 AM

l దశాబ్దాలుగా గల్ఫ్ కార్మికులు అవస్థలు పడ్డారు

l నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్

నిజామాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): ఈ ప్రాంతంలో ఉపాధి, ఉద్యోగాలు కల్పించకపోవడంతో తెలంగాణ ప్రజలు గల్ఫ్ బాటపట్టారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. ఆదివారం ఆయన యూఏఈ ఇండియన్ పీపుల్స్ ఫోరం ప్రతినిధి జితేందర్ వైద్యతో కలిసి మీడియాతో మట్లాడారు. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్ పార్టీకి గల్ఫ్ బాధితుల కష్టాలు కనిపిస్తాయని ఎద్దేవా చేశారు. అనేక సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతలో గల్ఫ్ బాధితులు పడుతున్న కష్టానికి కారణం ఈ ప్రాంతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు. ఈ ప్రాంతంపై నిర్లక్ష్యం చూపడంతోనే యువత గల్ఫ్ బాట పట్టారని అన్నారు. కాంగ్రెస్ అనేక సంవత్సరాల తర్వాత గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలనుకోవడం సిగ్గుచేటని, కొన్ని దశాబ్దాల తర్వాత ఇప్పుడే గల్ప్ బోర్డు ఏర్పాటు చేయాలనుకోవడం వెనుక కారణం ఏంటని ప్రశ్నించారు.

యూఏఈ ఇండియన్ పీపుల్స్ ఫోరం గల్ఫ్ కార్మికులకు సహాయం

అనేక సంవత్సరాలుగా యూఏఈ ఇండియన్ పీపుల్స్ ఫోరం గల్ఫ్ కార్మికులకు అనేక రకాలుగా సహాయపడుతోందని యూఏఈ ఇండియన్ పీపుల్స్ ఫోరం ప్రతినిధి జితేందర్ వైద్య చెప్పారు. తమ ఫోరం తరఫున 24 మంది డాక్టర్లు గల్ఫ్ కార్మికులకు వైద్యం అందిస్తున్నారని, కార్మికలు ఎదుర్కొంటున్న సమస్యలపై తమ ఫోరానికి సంబంధించిన లాయర్లు న్యాయ సహాయం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ అనుబంధ సంస్థగా తాము గల్ఫ్ కార్మికులకోసం అనేక రకాల సేవలు అందిస్తున్నట్టు, మహమ్మారి కోవిడ్, వరదల సమయంలో సైతం కార్మికులను ఆదుకున్నట్టు చెప్పారు. మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని, గల్ఫ్‌లో ఎవరైన మరణిస్తే తమ సంస్థ తరపున వారి మృతదేహాలను స్వదేశానికి రప్పించడంలో మోదీ సహాయ సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు దినేష్ కులచారి, పార్టీ రాష్ట్ర నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.