12-11-2025 11:47:23 PM
‘నేను ఇప్పటివరకు తెలుగు, తమిళంలో ఎంతో మంది స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నా. కానీ, కొన్ని సినిమాలు చేసి ఉండకూడదని ఇప్పుడు అనిపిస్తోంది. కొన్ని కమర్షియల్ సినిమాల్లో నటించడం వల్ల నటిగా నాకు ఎలాంటి సంతృప్తి లభించలేదు. నాలుగు డ్యాన్స్ స్టెప్స్ వేసి, ఏవో డైలాగ్స్ చెప్పిస్తారు. ఈ రొటీన్ చిత్రాలు చేసేటప్పుడు నేను సరిగ్గా ఆలోచించలేకపోయినందుకు పశ్చాత్తాపపడుతున్నా. ఇకపై అలాంటి సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నా..’ అంటూ తన మనసులోని మాటలను బయటపెట్టింది మలయాళీ ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్.
రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సినిమాలో దుర్గ పాత్రలో కనిపించిన అను ఇమ్మాన్యుయేల్ నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా సమావేశమైన హీరోయిన్ అను చెప్పిన సంగతులు ఆమె మాటల్లోనే..
నేను ఏ సినిమా చేసినా దానికి ఎలాంటి ప్రశంసలు వస్తాయని ఆశించను. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ నా సంతృప్తి కోసం, కొత్తగా ఏదైనా నేర్చుకోవచ్చని చేశాను. ఇందులో దుర్గ క్యారెక్టర్‌లో నటించాను. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు నా క్యారెక్టర్‌ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం వేసింది. కానీ ఆ తర్వాత డైరెక్టర్ రాహుల్ నా క్యారెక్టర్‌ను తీర్చిదిద్దిన విధానంతో హ్యాపీగా ఫీలయ్యా.
మా మూవీలో చూపించినట్లు మహిళకు ఎన్నో కండీషన్స్ ఈ సొసైటీ పెడుతుంటుంది. ఎలా మాట్లాడాలి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని ఎప్పుడు కనాలి.. ఇలాంటి షరతులెన్నో వుమెన్‌పై ఉంటాయి. మగవారికి ఉద్యోగం, సంపాదన తప్ప మిగతా ఇలాంటి కండీషన్స్ ఏవీ ఉండవు.
ఈ సినిమాలో నాకు అవకాశం వచ్చేటప్పటికే భూమా పాత్ర కోసం రష్మికను తీసేసుకున్నారు. అయితే, భూమా పాత్రలో నటించాలని నేనెప్పుడూ అనుకోలేదు. హాలీవుడ్ సినిమాల్లో హీరో, హీరోయిన్, విలన్.. ఇలా విభజన ఉండదు. ప్రతి ఒక్కరూ కథకు కాంట్రిబ్యూట్ చేసేలా క్యారెక్టర్స్ చేస్తారు. ఈ చిత్రంలో రాహుల్ అలాంటి ప్రయత్నమే చేశారు. మంచి టీమ్ కుదరకే గతంలో కొన్ని ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ ఆదరణ పొందలేకపోయాయి.
‘గర్ల్‌ఫ్రెండ్’ సినిమాలోని దుర్గలా ఉండాలంటే ముందు అంతా భూమాలాగే ఉంటారు. దుర్గలా ఉండే ధైర్యం మొదట్లోనే ఎవరికీ ఉండదు. పేరెంట్స్, ఫ్రెండ్స్, సొసైటీ ఎవరైనా మనల్ని అర్థం చేసుకోకుంటే సఫోకేషన్ ఫీల్ కలుగుతుంది. ఈ అనుభవం అబ్బాయిలకైనా ఎదురవుతుంది.
నా కెరీర్ పరంగా అసంతృప్తిగానే ఉన్నా, అయితే నటిగా సంతృప్తి ఉంది. పెద్దపెద్ద స్టార్స్‌తో కలిసి నటించాను. అయితే, నాది అవకాశాల కోసం ఆరాటపడే తత్వం కాదు. నాకు వచ్చే సినిమా తప్పకుండా దక్కుతుందని నమ్ముతా. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను.