16 April, 2026 | 12:29 PM

పొరపాటయింది.. నన్ను క్షమించండి

13-11-2025 12:00 AM
  1. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పే
  2. బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌పై ప్రకాశ్‌రాజ్ పశ్చాత్తాపం 
  3. సీఐడీ సిట్ విచారణకు హాజరు

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 12 (విజయక్రాంతి): ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ బుధవారం సీఐడీ సిట్ విచారణకు హాజరయ్యారు. ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లకు ప్రచారం కల్పించడం ద్వారా యువతను తప్పుదోవ పట్టించారన్న ఆరోపణలపై నమోదైన కేసులో భాగంగా, ఆయన సీఐడీ కార్యాలయంలో అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

అధికారులు గంటల తరబడి పలు కోణాల్లో ప్రశ్నించినట్లు సమాచారం. విచారణ ముగిసిన అనంతరం సీఐడీ కార్యాలయం బయట ప్రకాశ్‌రాజ్ మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారంలో తన ప్రమేయంపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, ప్రజలకు క్షమాపణ చెప్పారు. ‘2016లో నేను ఒక యాప్‌నకు ప్రచారం చేశాను. కానీ, 2017లో ఆ యాప్ బెట్టింగ్ యాప్‌గా రూపాంతరం చెందిందని తెలియగానే, నేను వెంటనే నా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాను.

అయినప్పటికీ, తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పే. ఈ విషయంలో నేను క్షమాపణ కోరుతున్నాను’ అని అన్నారు. ‘సిట్ అధికారులకు ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీల వివరాలను అందజేశాను. ఎంతో మంది యువత ఇలాంటి బెట్టింగ్, గేమింగ్ యాప్‌లలో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా నష్టపోతున్నారు.

వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇది చాలా బాధాకరం. కష్టపడితేనే ప్రతిఫలం ఉంటుంది, కష్టపడితేనే డబ్బులు వస్తాయి. దయచేసి యువత ఈ వ్యసనాలకు దూరం గా ఉండాలి. భవిష్యత్తులో నేను ఇలాంటి పొరపాటు చేయను’ అని ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేశారు.