16 April, 2026 | 3:49 AM

ఇదేం ఖర్మ!

16-04-2026 02:11 AM

అనుకున్నదొక్కటి.. అవుతున్నదొక్కటి!

  1. గందరగోళంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు
  2. అభివృద్ధి కోసమే పార్టీ మారినా.. పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు
  3. రెంటికి చెడ్డ రేవడిలా ఆ ఎమ్మెల్యేల పరిస్థితి

హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పది మంది ఎమ్మెల్యే లు బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఫిరాయించిన అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగానే కొనసాగుతోంది. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే పార్టీ మారినట్టు ప్రచారం చేసుకున్నారు.

పార్టీలు మారితే ప్రభుత్వంలో ప్రాధాన్యం పెరుగుతుందని, నియోజకవర్గాలకు నిధులు వరదలా వస్తాయని భావించినా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇప్పుడు రాజకీయంగా గందరగోళంలో చిక్కుకుపోయారు. అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరోలా ఉంది. క్షేత్రస్థాయిలో అభివృద్ధి కనిపించకపోవడం, ప్రభుత్వ స్థాయిలో ఆశించిన ప్రోత్సాహం దక్కకపోవడం, నియోజకవర్గ ప్రజల నుంచి పెరుగుతున్న ప్రశ్నలు వారిని తీవ్రమైన ఒత్తిడిలోకి నెడుతున్నాయి.

ఒకవైపు పాత పార్టీలో నమ్మకం కోల్పోయి, మరోవైపు కొత్త పార్టీలో పూర్తిస్థాయి అంగీకారం దక్కక రెంటికి చెడ్డ రేవడి లాగా వారి పరిస్థితి మారింది. దీంతో ఆ నేతలందరూ ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు.  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ, ప్రభుత్వ నిర్లక్ష్యంపై అసంతృప్తిని మెల్లగా బయటపెడుతున్నారు.

ఇప్పటికే కొందరు బహిరంగంగానే తమ ఆవేదనను వ్యక్తంచేయడం, అంతర్గత అసహనం బయటకురావడం, ప్రజల విశ్వాసం దెబ్బతినే సంకేతాలు.. ఫిరాయింపు రాజకీయాలపై కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఈ పరిణామాలు భవిష్యత్ ఎన్నికల సమీకరణాలను ప్రభావితం చేసేవిగా కనిపిస్తున్నాయి.

నినాదాలకే పరిమితం..

అభివృద్ధి కోసమే పార్టీ మారామని చెప్పుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలను క్షేత్రస్థాయి పరిస్థితులపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ మార్పు సమయంలో నియోజకవర్గాలకు నిధుల వరద వస్తుందని, పెండింగ్ ప్రాజెక్టులు వేగంగా పూర్తి అవుతాయని, అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని చెప్పిన హామీలు క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించకపోవడం గమనార్హం. నిజానికి అభివృద్ధి అనేది కేవలం పార్టీ మార్పుతో వెంటనే జరిగే ప్రక్రియ కాదు.

ప్రణాళికలు, నిధుల కేటాయింపు, అమలు యంత్రాంగం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఈ మూడు అంశాల్లోనూ స్పష్టత లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అనేక ప్రాజెక్టులు ఇంకా ఫైళ్లకే పరిమితం కావడం, మంజూరైన నిధులు విడుదలలో జాప్యం, స్థానిక అధికారుల నుంచి సమన్వయం లోపం వంటివి అభివృద్ధి వేగాన్ని తగ్గిస్తున్నాయి.

ముఖ్యంగా, అధికార పార్టీలో చేరిన వెంటనే ప్రాధాన్యం పెరుగుతుందని భావించిన ఎమ్మెల్యేలకు వాస్తవ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఉన్న సీనియర్ నేతలకు ప్రాధా న్యం ఎక్కువగా ఉండటంతో, కొత్తగా చేరిన వారికి అవకాశాలు పరిమితమవుతున్నాయి. దీనివల్ల అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే ఫిరాయించిన ఎమ్మెల్యేలు పార్టీ మార్పు సమయంలో చెప్పిన కారణాలు, ఇచ్చిన హామీలుఇవన్నీ ఇప్పుడు ఓటర్లే తిరిగి ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది.

క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఇప్పుడు ఉన్న వాస్తవ పరిస్థితులు పోల్చుకుంటే ప్రజల్లో నమ్మకం దెబ్బతింటోంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, ఉద్యోగావకాశాల విషయంలో ఆశించిన మార్పు లేకపోవడం ప్రజల్లో నిరాశను పెంచుతోంది. ఒకవైపు ప్రభుత్వం నుంచి ఆశించిన మద్దతు లేకపోవడం, మరోవైపు ప్రజల నుంచి ప్రశ్నలు పెరగడంతో ఫిరాయింపు నేతలు ఇప్పుడు రెండు వైపుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. 

బయటపడుతున్న అసంతృప్తి..

ఫిరాయింపు ఎమ్మెల్యేలలో పెరుగుతున్న అసంతృప్తి ఇప్పుడు అంతర్గత చర్చలకే పరిమితం కాకుండా బయటకు కూడా వెలుగుచూస్తోంది. మొదట్లో నిశ్శబ్దంగా ఉన్న ఈ అసహనం, కాలక్రమేణా బహిరంగ వ్యాఖ్యలుగా, సూచనలుగా, విమర్శలుగా బయటపడుతోంది. ఇది కేవలం వ్యక్తిగత అసంతృప్తి కాకుండా, ఒక విస్తృత రాజకీయ సంకేతంగా మారుతోంది. పార్టీ మార్పు సమయంలో ఆశించిన ప్రాధాన్యం, పదవులు, నిధుల కేటాయింపులు ఆశించిన స్థాయిలో లేకపోవడం ఈ అసంతృప్తికి ప్రధాన కారణం.

ముఖ్యంగా సమావేశాల్లో పట్టించుకోకపోవడం, నిర్ణయాల్లో భాగస్వామ్యం లేకపోవడం, స్థానిక నాయకత్వంతో ఘర్షణల లాంటి పరిణామాలు ఫిరాయింపు నేతల్లో అసహనాన్ని పెంచుతున్నాయి. ఇప్పటికే కొం దరు ఎమ్మెల్యేలు పరోక్షంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ‘మాకు తగిన గుర్తింపు రావడం లేదు, నియోజకవర్గ అభివృద్ధి ఆగిపోయింది’ వంటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల ముందు ఈ అసంతృప్తి బయటపడితే రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది.

ఫిరాయింపు ఎమ్మెల్యేల ప్రస్తుత పరిస్థితి వారి రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన ప్రభా వం చూపే దిశగా వెళ్తోంది. తమ రాజకీయ భవిష్యత్తు నిలబెట్టుకోవడానికి మరింత కష్టపడాల్సిన పరి స్థితి ఏర్పడుతోంది. అభివృద్ధి పేరి ట తీసుకున్న రాజకీయ నిర్ణయాలు, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇప్పుడు కఠిన పరిస్థితులు ఎదురవుతున్నా యి.

అయితే ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే కేవలం రాజకీ య లెక్కలు కాకుండా, క్షేత్రస్థాయి లో స్పష్టమైన ఫలితాలు చూపాల్సి న అవసరం స్పష్టమవుతోంది. ఇక ముందు ఫిరాయింపు ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు వారి చేతుల్లో నే ఉంది. అయితే ఫిరాయింపు రాజకీయాలు తాత్కాలిక లాభం ఇవ్వవ చ్చు, కానీ స్థిరమైన రాజకీయ భవిష్యత్తు కోసం నమ్మకం, పనితీరు, ప్రజల మద్దతే కీలకమని మరోసారి స్పష్టమవుతున్నది. 

రెంటికి చెడ్డ రేవడిలా..

ఫిరాయింపు రాజకీయాల అసలు దుష్పరిణామం ఇప్పుడు స్పష్టంగా బయటపడుతోంది. పార్టీ మార్పు ద్వారా లాభం పొందాలని భావించిన ఎమ్మెల్యేలు, ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా అన్న స్థితిలో చిక్కుకుపోయారు. ఒకవైపు పాత పార్టీలో నమ్మకం పూర్తిగా కోల్పోయారు. మరోవైపు కొత్త పార్టీలో పూర్తిస్థాయి అంగీకారం, ప్రాధాన్యం దక్కకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి కనిపిస్తోంది. పాత పార్టీ నుంచి విమర్శలు, కొత్త పార్టీలో అంతర్గత పోటీ, స్థానిక నేతల అసంతృప్తి కారణంగా ఫిరాయింపు నేతలందరూ పట్టుకోల్పోతున్నారు.

నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పాత పార్టీ కేడర్ దూరమవడం, కొత్త పార్టీ కేడర్ పూర్తిగా కలిసిపోకపోవడం వల్ల గ్రౌండ్ లెవల్లో బలహీనత పెరుగుతోంది. ఫలితంగా, ఎన్నికల సమయంలో తమకు తోడుగా నిలిచే బలమైన వ్యవస్థ లేకపోవడం ఒక పెద్ద ప్రమాదంగా మారుతోంది. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజకీయంగా ఒంటరిగా మారుతున్నారు. పాత పార్టీకి తిరిగి వెళ్లే అవకాశం లేకపోవడం, కొత్త పార్టీలో పూర్తి స్థానం సంపాదించలేక ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇప్పుడు గందరగోళంలో చిక్కుకున్నారు.