calender_icon.png 13 November, 2025 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాక్‌రెడ్డి పాత్రలు సమాజంలోనూ కనిపిస్తాయి

12-11-2025 11:49:14 PM

విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. ఈ చిత్రాన్ని మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్లపై మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్నారు. సంజీవ్‌రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, షేక్ దావూద్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందించారు. ఈ సినిమాలో జాక్‌రెడ్డి అనే వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు దర్శక నటుడు తరుణ్ భాస్కర్. ఫ్యునెరల్ సర్వీసెస్ నడిపే జాక్‌రెడ్డికి కుల పట్టింపు ఎక్కువే. ఆయన ఈ పాత్రలో వినోదం పంచబోతున్నారు. ఈ నెల 14న విడుదల కానున్న సందర్భంగా తరుణ్ భాస్కర్ మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. “సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు కొన్ని సందేహాలుండేవి. కానీ సినిమా చూసిన తర్వాత నా అనుమానాలన్నీ ఎగిరిపోయాయి. ఇదొక డీసెంట్ మూవీ. సినిమా అంతా సరదాగా సాగిపోయింది.

మనం బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా సినిమా చూసిన అనుభూతి కలిగింది. సమాజంలో ఇప్పుడున్న సంతాన లేమి అనే సమస్యను వినోదాత్మకంగా, భావోద్వేగపూర్వకంగా చెప్పడం క్లిష్టమైన పని. ఈ విషయంలో ‘సంతాన ప్రాప్తిరస్తు’ టీమ్ సక్సెస్ అయ్యారు. సినిమా చూసిన నాకు మంచి తెలుగింటి భోజనం తిన్నంత తృప్తి కలిగింది. నేను చేసిన జాక్‌రెడ్డి పాత్ర లాంటి వాళ్లు బయట కనిపిస్తుంటారు. పైకి టఫ్‌గా కనిపిస్తున్నారు కానీ, వాళ్ల లోపల సాఫ్ట్‌నెస్ ఉంటుంది. ఈ క్యారెక్టర్‌కు స్పిన్నాఫ్ కూడా చేసుకోవచ్చు. డైరెక్టర్ సంజీవ్‌రెడ్డి చాలా క్లారిటీతో ఈ సినిమా రూపొందించాడు. చైతన్య పాత్రలో విక్రాంత్ చక్కగా కుదిరాడు. నటీనటులందరూ బాగా నటించారు. టీమ్ అంతా నిజాయితీగా పడ్డ కష్టం తెర మీద కనిపిస్తుంది” అని చెప్పారు.