29 June, 2026 | 4:11 AM

డీలిమిటేషన్.. కుయుక్తి వ్యతిరేకంగా ఓటేస్తాం

16-04-2026 02:03 AM
  1. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం కాదు..
  2. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తాం : మల్లికార్జున ఖర్గే
  3. నేటినుంచి మూడురోజులు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15 : మహిళా రిజర్వేషన్ బిల్లుకు ‘ఇండీ’ కూటమి వ్యతిరేకం కాదని, అయితే ఈ బిల్లును కేంద్రం తీసుకొస్తున్న విధానంపైనే అభ్యంతరాలు ఉన్నాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. అలాగే, డీలిమిటేషన్ బిల్లును తాము వ్యతిరేకిస్తామ న్నారు. రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్‌ను ముడిపెట్టి కేంద్రం రాజకీయ కుతంత్రాలకు తెరలేపిందని, కుయుక్తులు పన్నింద ని ఖర్గే ఆరోపించారు.

రాజ్యాంగంలోని అధికారాలన్నింటిని కార్యనిర్వహవర్గం తీసుకుంటుందనన్నారు. కేవలం ప్రతిపక్ష పార్టీలను అణచివేయడానికే కేంద్రం ప్రభుత్వం ఇలాచేస్తుందని చెప్పారు. ఖర్గే నివాసంలో బుధవారం ‘ఇండీ’ కూటమి నేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు వ్యతిరేకంగా తామంతా పార్లమెంట్‌లో ఐక్యంగా పోరాడుతామని తెలిపారు.

కనీసం జనగణన కూడా పూర్తిచేయకుండా డీలిమిటేషన్‌పై కేంద్రం నిర్ణయం తీసుకుందని ఆయన విమర్శించారు. కొత్తగా చేపట్టే జనాభా లెక్కల తర్వాతే డీలిమిటేషన్ ప్రక్రియ జరపాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని ఖర్గే నివాసంలో జరిగిన ‘ఇండీ’ కూటమి సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో పాటు ఆర్జేడీ, శివసేన (ఉద్ధవ్ వర్గం), డీఎంకే, ఎన్సీపీ వంటి పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు.

మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2029 ఎన్నికల నుంచి అమలుచేసేందుకు గురువారం నుంచి మూడురోజులు పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో సవరణలు చేపట్టనున్నారు. మహిళలకు చట్టసభల్లో ౩౩ శాతం రిజర్వేషన్లు అమలుచేయడానికి, ఇప్పుడున్న లోక్‌సభ స్థానాల గరిష్ఠ సంఖ్య (550)ని గరిష్ఠంగా 850 వరకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో రాష్ట్రాల నుంచి ఎన్నికైనవారి సంఖ్యను 815, కేంద్ర పాలిత ప్రాంతాలుగా 35గా పేర్కొంది. ఇలా మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్ని ప్రతిపక్షాలే వ్యతిరేకిస్తున్నాయి.

బీజేపీ అధికార దాహం: రాహుల్ గాంధీ 

మహిళా రిజర్వేషన్ల ముసుగులో కేంద్ర ప్రభుత్వం అధికార దాహాన్ని ప్రదర్శిస్తోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన, జిమ్మిక్కుల ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దీనిని ఒక పక్కా వ్యూహంతో చేస్తున్న ‘అధికార దాహం’గా ఆయన అభివర్ణించారు.

మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పూర్తి మద్దతు ఇస్తుందని రాహుల్ స్పష్టం చేశారు. 2023లో పార్లమెంటు ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఇది రాజ్యాంగంలో భాగంగా ఉందని పేర్కొన్నారు. కొత్తగా తెస్తున్న సవరణల వల్ల మహిళలకు ఒరిగేదేమీ లేదని ఆయన కొట్టిపారేశారు. కేంద్రం ఓబీసీల హక్కులను కాలరాస్తోందని రాహుల్ మండిపడ్డారు. వెనుకబడిన వర్గాల సమాచారం లేని 2011 నాటి జనాభా గణనను వాడటం సరికాదన్నారు.

2027లో జరిగే కుల గణన ఆధారంగానే ఈ ప్రక్రియ జరగాలని డిమాండ్ చేశారు. ఎఫ్‌స్టీన్ ఫైళ్ల భయం వల్లే ప్రధాని మోదీ హడావిడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు, ఈశాన్య రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా రాష్ట్రాల ప్రాతినిథ్యం తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇది దేశ వ్యతిరేక చర్య అని ఆయన పేర్కొన్నారు.

ఓబీసీలు, దళితులు, గిరిజనుల వాటాను దొంగిలించడానికి తాము అంగీకరించబోమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో కేంద్రం కొత్త ఎత్తుగడలు వేస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. మహిళా సాధికారత కంటే రాజకీయ స్వలాభమే కేంద్రానికి ముఖ్యమని మండిపడ్డారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

FAQ:

ప్ర1. డీలిమిటేషన్ అంటే ఏమిటి?

డీలిమిటేషన్ అంటే పార్లమెంట్ మరియు రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల హద్దులను జనాభా మార్పులకు అనుగుణంగా మళ్లీ నిర్ణయించడం. భారతదేశంలో ఈ పని డీలిమిటేషన్ కమిషన్ చేస్తుంది.


ప్ర2. డీలిమిటేషన్ బిల్లు 2026 ముఖ్య ఉద్దేశం ఏమిటి?

2026 డీలిమిటేషన్ బిల్లు ప్రకారం జనగణన డేటా ఆధారంగా లోక్‌సభ మరియు విధాన్‌సభ స్థానాలను పునర్వ్యవస్థీకరించాలని ప్రతిపాదించారు. జనాభాకు అనుపాతంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే దీని ముఖ్య లక్ష్యం.


ప్ర3. దక్షిణ భారతదేశానికి డీలిమిటేషన్ వల్ల నష్టం జరుగుతుందా?

ఇది అత్యంత కీలకమైన అంశం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక వంటి దక్షిణ రాష్ట్రాలు జనాభా నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించాయి. అయితే డీలిమిటేషన్ జరిగితే జనాభా అధికంగా ఉన్న ఉత్తర భారత రాష్ట్రాలకు సీట్లు పెరిగి దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉంది.


ప్ర4. తెలంగాణకు డీలిమిటేషన్ వల్ల ఎన్ని సీట్లు తగ్గుతాయి?

ఖచ్చితమైన సంఖ్యలు ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే నిపుణుల అంచనా ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న సీట్ల కంటే తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో దక్షిణాది రాజకీయ శక్తి బలహీనపడుతుందని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి.


ప్ర5. డీలిమిటేషన్‌కు విపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?

డీఎంకే, కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ వంటి పార్టీలు దీన్ని దక్షిణ భారతదేశానికి అన్యాయంగా భావిస్తున్నాయి. జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలకు శిక్ష, చేయని రాష్ట్రాలకు బహుమతి దక్కుతుందని వారి వాదన.


ప్ర6. డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏమిటి?

డీలిమిటేషన్ కమిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం నియమించే స్వతంత్ర సంస్థ. దీనిలో సాధారణంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ముఖ్య ఎన్నికల కమిషనర్ మరియు రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. వీరి నిర్ణయాలను కోర్టులో సవాల్ చేయడం సాధ్యం కాదు.


ప్ర7. గతంలో డీలిమిటేషన్ ఎప్పుడెప్పుడు జరిగింది?

భారతదేశంలో డీలిమిటేషన్ 1952, 1963, 1973 మరియు 2002లో జరిగింది. 1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వం డీలిమిటేషన్‌ను 2001 వరకు నిలిపివేసింది. తర్వాత 2002లో మళ్లీ జరిగింది.


ప్ర8. డీలిమిటేషన్‌కు జనగణనకు సంబంధం ఏమిటి?

డీలిమిటేషన్ ఎల్లప్పుడూ జనగణన డేటా ఆధారంగా జరుగుతుంది. 2021 జనగణన కోవిడ్ కారణంగా ఆలస్యమైంది. 2026లో జనగణన జరిగితే ఆ డేటా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ మొదలవుతుంది.


ప్ర9. డీలిమిటేషన్ వల్ల రిజర్వేషన్లకు మార్పు వస్తుందా?

అవును. డీలిమిటేషన్ జరిగినప్పుడు ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు కూడా మారతాయి. కొన్ని నియోజకవర్గాలు జనరల్‌గా మారవచ్చు, కొన్ని కొత్తవి రిజర్వ్డ్ అవుతాయి. దీంతో దళిత, గిరిజన వర్గాల రాజకీయ ప్రాతినిధ్యం నేరుగా ప్రభావితమవుతుంది.


ప్ర10. డీలిమిటేషన్ బిల్లుపై ప్రజలు ఏమి చేయాలి?

డీలిమిటేషన్ రాజ్యాంగ ప్రక్రియ అయినప్పటికీ దాని ప్రభావం చాలా రాజకీయంగా ఉంటుంది. ప్రజలు తమ ప్రజాప్రతినిధులతో మాట్లాడాలి, పబ్లిక్ కన్సల్టేషన్లలో పాల్గొనాలి మరియు తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం అవగాహన పెంచాలి.