రేవంత్ ఓ హైబ్రిడ్ సీఎం
ఉదయం కాంగ్రెస్ ప్రతినిధిగా.. సాయంత్రానికి బీజేపీ నాయకుడిగా..
సీఎం రాజకీయ వైఖరిలో స్థిరత్వం లేదు
- దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే ఊరుకోం
- మహిళా రిజర్వేషన్లకు బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు
- ఫిర్జాదిగూడ సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
* మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలుచేయండి. పార్లమెంటులో 543 సీట్లు ఉన్నాయి, అక్కడ వర్తింపజేయండి. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, ఇక్కడ కూడా అమలు చేయండి. అయితే, మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజన, రాజ్యాంగ సవరణలతో అనవసరంగా ముడిపెట్టడం ఎందుకు?, అయోమయం సృష్టించడం ఎందుకు?
- కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి) : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఒక హైబ్రిడ్ ముఖ్యమంత్రి అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామా రావు ఎద్దేవా చేశారు. రేవంత్ రాజకీయ వైఖరిలో స్థిరత్వం లేదని ఆరోపించారు. ఉదయం ఆయన కాంగ్రెస్‌కు ప్రతినిధిగా ఉంటారు.. సాయంత్రానికి బీజేపీతో కలిసిపోతారని విమర్శించారు. సహజం గానే ఇలాంటి హైబ్రిడ్ విధానం ఆయన పాలనలో కూడా కనిపిస్తోంది అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
రాజ్యాంగ విధివి ధానాల ప్రకారం మొదట జనగణన, తర్వాత నియోజకవర్గాల పునర్విభజన, ఆ తర్వాతే నిర్మాణాత్మక మార్పులు జరగాలని స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలగని ఏ సహేతుకమైన ప్రతిపాదనకైనా బీఆర్‌ఎస్ మద్దతు ఇస్తుందని, కానీ దక్షిణాదికి అన్యాయం చేసే ప్రయత్నం జరిగితే మాత్రం తీవ్రంగా ప్రతిఘటిస్తామని, అవసరమైతే పెను ఉద్యమమే చేపడతామని హెచ్చరించారు. బుధవారం మేడ్చ ల్ జిల్లా ఫిర్జాదిగూడలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు కు బీఆర్‌ఎస్ మొదటి నుంచి చిత్తశుద్ధితో సంపూర్ణ మద్దతు ఇస్తోందని, తమ ప్రభుత్వ హయాంలో మహిళా సాధికారత కోసం అనేక చర్యలు అమలు చేసిన రికార్డు తమకు ఉందని స్పష్టంచేశారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడమే కాకుండా, అసెంబ్లీ, మండలిలో ఏకగ్రీవ తీర్మానాలు కూడా చేసిందని ఆయన గుర్తుచేశారు.
అంతేకాకుండా, స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, మార్కెట్ కమిటీల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలుచేయడం ద్వారా మహిళా సాధికారత పట్ల తమకున్న అచంచలమైన నిబద్ధతను చాటుకున్నామని తెలిపా రు. అయితే, మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజన, రాజ్యాంగ సవరణలతో అనవసరంగా ముడిపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
అత్యంత సరళమైన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు సంక్లిష్టం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. ‘మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయండి. పార్లమెంటులో 543 సీట్లు ఉన్నాయి, అక్కడ వర్తింపజేయండి. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నా యి, ఇక్కడ కూడా అమలు చేయండి. సీట్ల పెంపు, పునర్విభజనతో ముడిపెట్టి ఎందుకు అయోమయాన్ని సృష్టిస్తున్నారు?’ అని నిలదీశారు.
జీహెచ్‌ఎంసీ విభజనలో ఏం చేశారు..
ముఖ్యమంత్రి ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇతరుల నుంచి నిబంధనలు కోరుతున్న ముఖ్య మంత్రి, హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రతిపాదన విషయంలో జీహెచ్‌ఎంసీ ప్రతినిధులు, జెడ్పీటీసీ సభ్యులు లేదా ఎమ్మెల్యేలను ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు. మీకో విధానం, ఇతరులకో విధానం అంటే కుదరదని, ఒక జాతీయ పార్టీ గా కాంగ్రెస్ పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయకుండా స్పష్టతతో, బాధ్యతతో మాట్లాడా లి అని ఆయన పేర్కొన్నారు.
పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులో ఉన్న అస్పష్టతలపై ఆం దోళన వ్యక్తం చేశారు. 50 శాతం సీట్లు పెరుగుతాయని కేంద్ర నేతలు చెబుతున్నప్పటికీ, బిల్లులో మాత్రం ఆ ప్రస్తావన ఎక్కడాలేదని గుర్తుచేశారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై 2022-23 నుంచే బీఆర్‌ఎస్ గళమెత్తుతోందని, కేవలం జనాభా ప్రాతిపదికన పార్లమెంటు సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. 1971లో పార్లమెంటు సీట్లపై విధించిన స్తంభన జనాభా నియంత్రణ ప్రాతిపదికన జరిగిందని కేటీఆర్ గుర్తుచేశారు.
గత ఐదు దశాబ్దాలుగా దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ చర్యలను విజయవంతంగా అమలు చేశాయని తెలిపారు. జాతీయ జనాభా విధానాన్ని తూచా తప్పకుండా పాటించినందుకు ఇప్పుడు మమ్మల్ని శిక్షిస్తా రా? అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం సుమారు 24 శాతం ఉందని, ఈ శాతాన్ని ఏ స్థితిలోనైనా కాపాడాలని ఆయన నొక్కి చెప్పారు.
0.01 శాతం తగ్గుదల కూడా మాకు ఆమోదయోగ్యం కాదని, ఆరు దక్షిణా ది రాష్ట్రాల లోక్‌సభ సీట్ల శాతం 24 శాతం గా నే కొనసాగాలన్నారు. దీనిని మార్చే ప్రయ త్నం చేస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదు అని కేటీఆర్ హెచ్చరించారు. ఈ ఆందోళనలను పట్టిం చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
‘మీరు ఒక నిప్పుల కుంపటి మీద కూర్చున్నా రు, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంతో ఆడుకుంటే తీవ్రమైన తిరుగుబాటు వస్తుంది’ అని అన్నారు. ఇలాంటి చర్యలను అడ్డుకునేందుకు ఇతర రాజకీయ పార్టీలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కేవలం రాజకీయా ల మీద కాకుండా, పాలన, ప్రజాసంక్షేమంపై దృష్టి సారించాలని సూచించారు.
మా వైఖరిలో మార్పు లేదు..
నియోజకవర్గాల పునర్విభజన విషయం లో బీఆర్‌ఎస్ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. మూడేళ్ల క్రితం తాము తీసుకున్న దృఢమైన స్టాండ్‌కు కట్టుబడి ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు. నియోజక వర్గాల పునర్విభజన అంశంపై కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీచేశారు.
దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గేలా డీలిమిటేషన్ జరిగితే, అది కేవలం ఒక రాజకీయ ప్రక్రియగానో లేక చట్ట సవరణగానో మిగిలిపోదని, మొత్తం దక్షి ణ భారతదేశం అంతటా ఒక బలమైన ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని ఆయన స్పష్టం చేశారు. తామంతా గర్వించదగ్గ భారతీయులమని, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అత్యుత్తమ రాష్ట్రాల ప్రతినిధులమని కేటీఆర్ పేర్కొన్నారు.
జనాభా నియంత్రణతో పాటు వివిధ రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న దక్షిణ రాష్ట్రాలకు, ఈ పునర్విభజన వల్ల రాజకీయంగా అన్యాయం జరగడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించాల్సింది పోయి, వాటి ప్రాతినిధ్యాన్ని తగ్గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన విమర్శిం చారు.
దేశంలోని అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటులో తమ ప్రజల స్వరాన్ని, ప్రతినిధిత్వాన్ని అణచివేయాలని చూ స్తే తాము నిశ్శబ్దంగా చూస్తూ ఉండబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. దక్షిణ భారతీయుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తామని ప్రకటించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని, ఢిల్లీ పాలకులు తమ మాట వినాలని, బుద్ధి ప్రబలాలని ఆశిస్తున్నామని తెలిపారు.






