28 March, 2026 | 4:19 AM

అనుమాన పక్షి.. పూర్తి ఒరిజినల్ కంటెంట్

28-03-2026 02:15 AM

రాగ్ మయూర్ హీరోగా ‘డీజే టిల్లు’ ఫేమ్ విమల్‌కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అనుమాన పక్షి’. చిలకా ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలకా, రాజేశ్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. ఇందులో మెరిన్ ఫిలిప్ కథానాయిక. ప్రిన్స్ సెసిల్, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, సుప్రీత్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభిస్తూ, ఈ సినిమా నుంచి ‘గులాబ్ జామ్’ సాంగ్‌ను విడుదల చేశారు.

సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల స్వరపర్చిన ఈ పాటను రమణ గోగుల ఆలపించగా, కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. సాంగ్ లాంచ్ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ఈవెంట్‌కు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘అనుమాన పక్షి సినిమా కంటెంట్ కొంత చూశాను. చాలా ఫన్ వుంద’ని దిల్ రాజు తెలిపారు. హీరో రాగ్ మయూర్ మాట్లాడుతూ.. “ఒక పూర్తి క్యారెక్టర్ ఫిల్మ్ చేయడం నాకు ఇదే ఫస్ట్ టైమ్. గులాబ్ జామ్.. నా కెరీర్‌లో ఫస్ట్ సాంగ్. అది కూడా రమణ గోగుల లాంటి గొప్ప సింగర్ పాడటం చాలా ఆనందాన్నిచ్చింది. ఆయన ఈ పాటను నెక్స్ లెవెల్‌కు తీసుకువెళ్లారు.

అనుమాన పక్షి పూర్తిగా ఒరిజినల్ కం టెంట్. ఎక్కడ ఏ ఇన్‌స్పిరేషన్ ఉండదు” అని చెప్పారు. హీరోయిన్ మెరీన్ ఫిలిప్ మాట్లాడుతూ.. “తెలుగులో ఇది నాకు మొదటి చిత్రం. నా తొలి సినిమాకు ఇంత మంచి టీమ్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా అందరిని అలరిస్తుంది” అని తెలిపింది. డైరెక్టర్ విమల్ కృష్ణ మాట్లాడుతూ.. “ఇది మంచి వినోదాత్మక చిత్రం. ఇందులో చిన్న సైకలాజికల్ సస్పెన్స్ కూడా ఉంటుంది. కచ్చితంగా థియేటర్‌లో ఒక ఫన్ రైడ్‌లానే ఉంటుంది” అన్నారు. ‘ఇది చాలా యూనిక్  ఫిలిం. ఇలాంటి సినిమా మరొకటి లేద’ని నిర్మాత రాజీవ్ చిలకా అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ హీరోయిన్ రాశి, కో ప్రొడ్యూసర్ భరత్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల తదితర చిత్రబృందం కూడా మాట్లాడారు.